సాహితీ ప్రక్రియలో కథలకు విశిష్టమైన స్థానం ఉంది. మానసిక ఉల్లాసానికీ, సరికొత్త ఆలోచనా దృక్పథానికీ కథలు తమ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమధ్యకాలంలో కథలకు పెద్దగా ప్రోత్సాహం లభించేది కాదు. అయితే ఇప్పుడు యువ రచయితలు కలం ఝలిపిస్తూ.. కొత్త కొత్తగా రాయడం మొదలెట్టారు. దాంతో కథకు మళ్లీ ప్రాణం వచ్చింది. సాహిత్యాన్ని, కొత్తగా కథలు రాస్తున్నవాళ్లని, ముఖ్యంగా కథల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తెలుగు 360 ‘కథా కమామిషు’ పేరుతో కొత్త శీర్షిక ప్రవేశ పెడుతోంది. వారం వారం ప్రధాన పత్రికలలో ప్రచురితమైన కథల గురించిన ఓ చిన్నపాటి విశ్లేషణ ఇది. కథలు రాస్తున్నవాళ్లకు ప్రోత్సాహకరంగానూ, కథలు రాయాలనుకొంటున్నవాళ్లకు ఉత్ప్రేరణగానూ ఉండాలన్న ఆలోచనతోనే ఈ మా ప్రయత్నం. ఈవారం (మే 26) ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలలో వచ్చిన కథలు, అందులోని ఇతివృత్తాలు, రచయిత శైలిని కాస్త విపులంగా పరిశీలిస్తే…
కథ: జీవించు నీ కోసమే
రచన: శ్రీపతి లలిత
పత్రిక: ఈనాడు
జాగ్రత్తగా ఖర్చు పెట్టడం వేరు, పిసినారితనం చూపించడం వేరు. దుబారా ఎంత అనర్థమో, అవసరం అయినప్పుడు కూడా రూపాయికీ, రెండ్రూపాయలకూ ఆలోచించడం అంతకంటే అనర్థం. ముఖ్యంగా వృద్ధాప్యంలో జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అప్పుడు కూడా రూపాయి రూపాయి కూడబెట్టడం కోసమో, వారసుల కోసం దాచి పెట్టడం కోసమో తమదైన ఆనందాలు త్యాగం చేయడం వృధా ప్రయాసే. `జీవించు నీ కోసమే` సూటిగా చెప్పిన సందేశం ఇది. ఉష, శశి అనే ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ. ఇద్దరి ఆర్థిక స్థోమత ఇంచుమించు ఒకటే. కానీ అక్క అతి జాగ్రత్తకు పోయి, పిసినారితనం చూపిస్తే, చెల్లెలు ఉన్నదాంట్లో హాయిగా బతకేసే రకం. అక్కలో చెల్లెలు ఎలాంటి పరివర్తన తీసుకొచ్చిందో తెలియాలంటే ఈ కథ చదవాలి. ‘ఇండియన్ సీనియర్ సిటీజన్స్ ఆర్ డయింగ్ రిచ్, బట్ నాట్ లివింగ్ రిచ్’ అనే వాక్యం అక్షర సత్యం అనిపిస్తుంది. వృద్ధాప్యంలో ఎలా బతకాలో కనువిప్పు కలిగేలా చెప్పిన కథ ఇది.
కథ: ఎట్టి మాలోళ్ల ఈరన్న
రచన: సురేంద్ర శీలం
పత్రిక: సాక్షి
నవతరం కథకుల్లో సురేంద్ర శీలం పేరు కాస్త గట్టిగానే వినిపిస్తోంది. సీమ యాసని చక్కగా ఒడిసి పట్టుకొన్న కలం సురేంద్రది. తన నుంచి వచ్చిన మరో కథ ‘ఎట్టి మాలోళ్ల ఈరన్న’. సీమ యాస సొగసు పెనవేసుకొన్న అక్షరాలు, మాటల ఒడుపు, కథా వాతావరణాన్ని కళ్లకు కట్టిన విధానం.. ఆకట్టుకొంటాయి. ఓ యాసని అర్థం చేసుకొని, ఆ దారి వెంట కళ్లు పరుగులు పెట్టడం కొంచెం కష్టమైన పనే. కాకపోతే.. కథ మొదలెట్టిన కాసేపటికే ఆ శైలి పాఠకులకు పట్టేస్తుంది. ఆ తరవాత ఆ ప్రవాహంతో పరుగులు పెడతాం. కథ విషయానికొస్తే.. ఊర్లో చావు. గొయ్యి తీయడానికి ఈరన్నని పిలుస్తారు. ‘నేను రాను’ అని కబురంపుతాడు ఈరన్న. పెద్ద మనుషులు గద్దించినా.. వీరన్న ధిక్కార స్వరమే వినిపిస్తాడు. ఎందుకూ, ఏమిటి అనేదే మిగిలిన కథ. సీమ యాసని ఇష్టపడేవాళ్లు తప్పకుండా చదవాల్సిన కథ. కొన్ని ఉపమానాలు భలే కుదిరాయి. ముఖ్యంగా కథలో చివరి వాక్యం ‘ఈరన్న ఉదయిస్తా పోయినాడు’ మెరుపులా మెరిసింది.
కథ: కర్ణం కుందయ్య
రచన: తగుళ్ల గోపాల్
పత్రిక: ఆంధ్రజ్యోతి
‘కర్ణం కుందయ్య’ అని పేరు పెట్టారు కానీ, ఇదో నాయినమ్మ కథ. కథంతా చదివాక నాయినమ్మ పాత్ర అంతలా గుర్తుండిపోతుంది. ఊర్లో, మన ఇంటి పక్కనో, మన వీధిలోనో, లేదంటే మనింట్లోనో ఇలాంటి వ్యక్తిత్వాలూ, అలవాట్లూ, ఆదర్శలూ, అభిమానాలూ ఉండే నాయినమ్మలు, అమ్మమ్మలూ గుర్తొస్తారు. మనిషి మీద, మనిషితనం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. మనుషుల్ని అర్థం చేసుకొనే విధానంలో కొంతైనా మార్పు వస్తుంది. కొత్త కథేం కాదు. కథనంలోనూ మెరుపులేం లేవు. కానీ ఆద్యంతం చదివిస్తుంది. భాషలో సొగబులు నచ్చుతాయి. తెలంగాణ యాసలో కొన్ని కొత్త పదాలు, సామెతలూ తెలుసుకొనే వీలుంది.
కథ: చేదు పాట
రచన: పి.చంద్రశేఖర ఆజాద్
పత్రిక: నమస్తే తెలంగాణ
పాటని ప్రేమించి, ప్రాణంలా భావించిన ఓ గాయకుడి కథ ఇది. తరవాత ఉద్యమంలోకి వెళ్తాడు. వెళ్లాక అనేక ప్రశ్నలు వెంటాడతాయి. అవన్నీ ఈ కథలో చర్చించారు కూడా. రచయిత లేవనెత్తిన ప్రశ్నలు కొన్ని ఆలోచింపజేస్తాయి కూడా. ఉద్యమంలో ఏం జరుగుతోంది? ఎలాంటి లక్ష్యాల కోసం మొదలైన ఉద్యమం చివరికి ఎలా చేరింది? అనే చర్చ, విశ్లేషణ ఈ కథలోని పాత్రల మధ్య సంభాషణగా సాగింది. గొప్ప లక్ష్యాలతో ఉద్యమంలోకి వెళ్లిన వాళ్లకు వ్యక్తిగత బంధాలు ఉండకూడదా? వాళ్ల కళాసేవకు క్రెడిట్ దక్కకూడదా? అనే ప్రశ్నలు సహేతుకంగా అనిపిస్తాయి. కామ్రేడ్ల తరపున మాట్లాడేవాళ్లకు కూడా వాళ్ల తరపున ఉన్న కొన్ని తప్పులు తెలుస్తాయి.
– అన్వర్