మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అని ఓ సామెత ఉంది! రాష్ట్ర విభజన తరువాతి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతూ వచ్చింది. పేరున్న నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారు. కాస్తోకూస్తో మిగిలినవారు కూడా గడచిన ఎన్నిక ముందు దుకాణం సర్దుకున్నారు. ఇక, ఆంధ్రాలో ఇప్పుడు అధికారం కోల్పోవడంతో… తెలంగాణలో ఇంకా టీడీపీలో కొనసాగడం ఎందుకు బ్రదర్ అనే ఆలోచనలో ఉన్నవాళ్లు కూడా బయట చూపులు చూస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఎలాగూ ఆపరేషన్ కమల్ కొనసాగుతోంది. గతవారంలో ఒకరిద్దరు పేరున్న టీడీపీ నేతలు కమలం గూడికి చేరారు. ఇప్పుడు టీడీపీలో ప్రముఖ నేతలు ఎవరూ అంటే.. ఎల్. రమణ, రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.
టీటీడీపీలో ప్రముఖ నేతగా పేరున్న రేవూరి కూడా ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగుతారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన కూడా భాజపాలో చేరే క్రమంలోనే ఉన్నట్టు సమాచారం. తాజాగా, తన అనుచరగణంతో రాజకీయ భవిష్యత్తుపై చర్చించారనీ, జెండా పీకేద్దాం బ్రదర్ అంటూ సన్నిహితుల ముందు వ్యాఖ్యానించారని వినిపిస్తోంది. పార్టీలో కొనసాగితే ఏరకంగా భవిష్యత్తు ఉండదని అనుచరగణం కూడా ఆయన మీద ఒత్తిడి తెస్తోందట! రేవూరిని భాజపాలోకి తెచ్చే ప్రయత్నాలను గరికపాటి సాగిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్యనే, గరికపాటి ఇంట్లో రేవూరితోపాటు ఉమ్మడి వరంగల్ కి చెందిన కొంతమంది టీడీపీ నేతలు సమావేశమైనట్టు తెలుస్తోంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కూడా పార్టీకి దూరం కాబోతున్నట్టు వినిపిస్తోంది.
భాజపా అవసరాల దృష్ట్యా చూసుకున్నా… ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి బలమైన నాయకుల అవసరం ఉంది. అందుకే, రేవూరి తీసుకొచ్చి… పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే… పార్టీ విస్తరణను ఆయన సమర్థంగా చేయగలరు అనే వ్యూహంతో కమలదళం ఉన్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే భాజపా నుంచి రేవూరికి కూడా పార్టీలో కీలక స్థానం కల్పిస్తామనే హామీ ఇచ్చినట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవూరి కూడా టీడీపీకి దూరమైతే తెలంగాణలో చెప్పుకోదగ్గ నేతలంటూ ఎవ్వరూ లేని పరిస్థితి పార్టీకి వస్తుంది. రేవూరి పార్టీ మార్పుపై వస్తున్న ఈ కథనాల మీద ఆయన ఎలా స్పందిస్తారో చూడా