కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేలా షర్మిల పార్టీని రంగంలోకి తెస్తున్నారని.. ఆ కోణంలోనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై సెంటిమెంట్ పెంచడానికి టీఆర్ఎస్ నేతలు దుర్భాషలు ఆడుతున్నారని పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. సాధారణంగా వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ పార్టీ వారే. దీంతో రేవంత్ రెడ్డి విరుగుడు రాజకీయాలు ప్రారంభించారు. వైఎస్‌ను పల్లెత్తు మాట అనకుండా.. అదే సమయంలో పొగుడుతూ.. చాణక్యం ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల కిందట జల వివాదాల్లో వైఎస్‌ను టీఆర్ఎస్ నేతలు తిట్టడంపై స్పందించారు. జల దోపిడీలో వైఎస్ పాత్ర లేదని..జగన్ – కేసీఆర్ కూడబలుక్కుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ప్రకటించారు.
ఇప్పుడు మరోసారి.. వైఎస్‌ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపారు. రేవంత్ రాజకీయం కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. వైఎస్ సెంటిమెంట్ ప్రజల్లో ఎంతో కొంత ఉందన్న ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు వైఎస్ కుమార్తె షర్మిలను రంగంలోకి దింపారని అనుకుంటున్నారు. అందుకే.. రేవంత్ కూడా దానికి తగ్గట్లుగా రాజకీయం ప్రారంభించారు. నిజానికి రేవంత్‌కు వైఎస్‌పై గతంలో ఎప్పుడూ సదభిప్రాయం లేదు. జడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచిన తర్వాత ఆయనను వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ రేవంత్ టీడీపీలో చేరారు.
ఆ తర్వాత వైఎస్‌పై పోరాటం చేశారు. అయితే.. అభిప్రాయాలు మార్చుకోనివాళ్లు రాజకీయ నేతలు ఎలా అవుతారని.. రేవంత్ నిరూపిస్తున్నారు. ఇతర పార్టీల రాజకీయాలకు దానికి తగ్గట్లుగానే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి వైఎస్ బ్రాండ్‌ను షర్మిలకు మాత్రమే వదిలేయకుండా.. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని చెప్పేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. షర్మిల పార్టీ రాను రాను.. ఆంధ్రా పార్టీగా ప్రజలు గుర్తిస్తారన్న అంచనాల నేపధ్యంలో రేవంత్ వ్యూహం కరెక్టేనని.. కాంగ్రెస్ నేతలు కూడా ఓ అంచనాకు వస్తున్నారు.