తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బండ్ల గణేష్ ఇంటికి వెళ్లారు. దాదాపుగా రెండు గంటల పాటు రాజకీయాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి అంత సమయం కేటాయించి మరీ బండ్ల గణేష్‌తో చర్చలు జరపడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ హాట్ టాపిక్ అయింది. నిజానికి బండ్ల గణేష్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఓ టీవీ చానల్ ఓవర్‌తో లాబీయింగ్ చేసుకున్నారు. టిక్కెట్ పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బ్లేడ్ చాలెంజ్‌లు చేశారు. చివరికి ఆయన టీఆర్ఎస్కు సారీ చెప్పి.. తనకు రాజకీయం సరిపడలేదని.. ఇక సైలెంట్‌గా ఉంటానని చెప్పారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్లుగానే లెక్క.
ఆయనను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే బండ్ల గణేష్‌తో వచ్చే లాభం కన్నా.. నష్టమే ఎక్కువ అని రాజకీయవర్గాల్లో ఓ అంచనా ఉంది. ఆయన మాటల వల్ల .. ఆయన ను ఉపయోగించుకోవాలనుకునేవారికి నష్టమే జరుగుతుంది. అందుకే ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ సహా అందరూ దూరం పెట్టారు. ఎవరూ దగ్గరకు రానీయడం లేదు. పూరి కుమారుడి సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు పిలిస్తే వాళ్లింటి గుట్టు అంతా ఆడియో వేదికగా బయట పెట్టి రచ్చ చేసేశారు. పూరి ఫ్యామిలీ బండ్ల వల్ల తలదించుకోవాల్సి వచ్చింది.
బండ్ల గణేష్‌తో పెట్టుకుంటే అంతే ఉంటుంది. అలాంటిది .. రేవంత్ రెడ్డి ఆయనను ఎలా వాడుకోవాలనుకుంటున్నారో కానీ.. మొత్తానికి రెండు గంటల పాటు చర్చలు జరిపి వచ్చారు. దీనికి బండ్ల గేణేష్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో కానీ.. ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే మాత్రం వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని రేవంత్ వ్యతిరేకులే కాదు… అనుకూలురు కూడా చెబుతున్నారు. ఆ మాత్రం రేవంత్‌కు తెలియదని అనుకోవద్దని.. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయని కొంత మంది సమర్థించుకుంటున్నారు.