తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ , డ్రగ్స్ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలన్న అంశంపై రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 20వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
తెలంగాణలో ఇటీవలి కాలంలో డ్రగ్స్ పై ఈడీ కేసుల విచారణ జరుగుతోంది. ఈ అంశంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి అదే పనిగా కేటీఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. డ్రగ్స్ , ఈడీ కేసుల విచారణలో రేవంత్ రెడ్డి పదే పదే కేటీఆర్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో డ్రగ్స్ టెస్టులు చేయించుకుందామంటూ వైట్ చాలెంజ్ పేరుతో మరింత రాజకీయం చేశారు. దీంతో తనను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూండటంతో ఆయన కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ అదే పనిగా ఆరోపణలు చేస్తున్నందున తక్షణం వాటిని ఆపేలా ఇంజక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోర్టు కేటీఆర్ న్యాయవాదుల వాదనతో ఏకీ భవించి .. కేటీఆర్‌తో డ్రగ్స్ ముడిపెట్టి ఆరోపణలు చేయవద్నది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డ్రగ్స్ విషయంలో కేటీఆర్ పేరును మరింతగా ప్రచారంలోకి తీసుకురావాలన్న రేవంత్ రెడ్డి వ్యూహానికి బ్రేక్ పడినట్లయింది.