ఒకప్పుడు డబ్బింగ్ సినిమా అంటే తెలుగులో చిన్న చూపే ఉండేది. అప్పుడప్పుడు ‘జెంటిల్మెన్’, ‘ఒకే ఒక్కడు’ లాంటి సినిమాలొచ్చి.. షాక్ ఇచ్చి వెళ్తుండేవి. కమల్, రజనీ, అర్జున్ లాంటి స్టార్ హీరోలకే తెలుగులో మార్కెట్. అయితే క్రమంగా.. చిన్న సైజు హీరోల సినిమాలకూ క్రేజ్ వచ్చింది. ‘ఏ భాష నుంచైనా మంచి సినిమా తీసుకురండి.. ఆదరిస్తాం’ అంటూ తెలుగు ప్రేక్షకులు పెద్ద మనసు చూపించేవారు. క్రమంగా.. టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాకి గట్టి మార్కెట్ ఏర్పడింది. చిన్న సినిమా, కొత్త హీరో, తక్కువ బడ్జెట్.. ఇవేం చూడకుండా కంటెట్‌ని నమ్మి వచ్చిన సినిమాలకు తెలుగులో కాసుల వర్షం కురిసేది. ‘ప్రేమిస్తే’ నుంచి ‘బిచ్చగాడు’ వరకూ లక్షల్లో పెట్టి కొన్న సినిమాకు కోట్లు దక్కాయి. దాంతో.. డబ్బింగ్ రైట్స్‌కి రెక్కలొచ్చాయి. రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా అయితే ఇక చూసుకోవాల్సిన పని లేదు. కేవలం తెలుగు నుంచే డబ్బింగ్ హక్కుల రూపంలో రూ.60 నుంచి రూ.80 కోట్ల వరకూ ఆర్జించొచ్చు. అలా క్రమంగా.. తెలుగు సినిమాకి గట్టి పోటీ ఇవ్వడం మొదలెట్టింది డబ్బింగ్ బొమ్మ.
అయితే ఇదంతా గతం. గత కొన్నేళ్లుగా డబ్బింగ్ సినిమా పప్పులేవీ తెలుగులో ఉడకడం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం బోల్తా కొడుతున్నాయి. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన సినిమాలు అరా కొర గానే కనిపిస్తున్నాయి. 2018లోనూ… అదే సీన్ పునరావృతం అయ్యింది. వరుస పరాజయాలు డబ్బింగ్ మార్కెట్ ని మరింత కృంగదీశాయి.
2018 డబ్బింగ్ సినిమాల ప్రస్థానం సూర్యతో మొదలైంది. తన సినిమా గ్యాంగ్ సంక్రాంతికి విడుదలైంది. తమిళంలో ఈసినిమాకి మంచి ఆదరణే దక్కింది. తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే ఆడింది. విక్రమ్ కి చాలా యేళ్లుగా హిట్టే పడలేదు. ఈ యేడాది విడుదలైన స్కెచ్, సామి 2 కూడా ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. సూర్య తమ్ముడు కార్తికీ ఎదురుదెబ్బలు తప్పలేదు. తన సినిమా ‘చినబాబు’ బాక్సాఫీసుని ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. స్టార్ హీరోలైన కమల్, రజనీకీ 2018 కలసి రాలేదు. కమల్ ‘విశ్వరూపం 2’ నీరసం తెప్పించింది. ‘శభాష్ నాయుడు’ ఊసే లేదు. ఈ సినిమా పూర్తి చేస్తారా, లేదంటే మధ్యలోనే ఆపేస్తారా అనేది ఇప్పటికీ తెలీదు. రజనీ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాల అభిమానుల్ని, పంపిణీదారుల్నీ దారుణంగా నిరాశ పరిచింది. ‘రోబో 2.ఓ’కి ఓపెనింగ్స్ అదిరాయి. కానీ భారీ రేట్లు పెట్టి కొనడం వల్ల.. తెలుగులో నష్టాలు తప్పలేదు.
‘బిచ్చగాడు’ తరవాత విజయ్ ఆంటోనీకి ఇక్కడ ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘కాశి’, ‘రోషగాడు’ రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. విజయ్ ‘సర్కార్’ తెలుగులోనూ మెప్పించడం, విశాల్ నటించిన ‘అభిమన్యుడు’, ‘పందెంకోడి 2’ చిత్రాలకు మంచి వసూళ్లు దక్కడం కాస్త ఉపశమనం కలిగించే విషయాలు. మణిరత్నం ‘నవాబ్’కి విమర్శల ప్రశంసలు దక్కాయి. నయనతార నటించిన కొన్ని సినిమాలు తమిళ, మలయాళ భాషల్లోంచి డబ్ అయ్యాయి. వాటిని ప్రేక్షకులు ఆదరించలేదు. హారర్, థ్రిల్లర్ చిత్రాలు విరివిగానే వచ్చినా.. అవేం నిలబడలేకపోయాయి. మొత్తానికి వంద సినిమాలు విడుదలైతే రెండో మూడో హిట్ అనిపించుకున్నాయి. మిగిలివన్నీ తెలుగు సినిమాలతో పోటీ తట్టుకోలేక, విషయం లేక చతికిలపడ్డాయి.