సినిమా అనే వ్యాపారం హీరోల చుట్టూనే తిరుగుతుంది. వాళ్లెంత యాక్టివ్‌గా ఉంటే.. ఇండ్రస్ట్రీ అంతగా కళకళలాడుతుంది. స్టార్ హీరోలు ఏడాదికి రెండు మూడు హీరోలు చేయాలని చూసేది కూడా అందుకే. ఇది వరకటి కంటే… హీరోల దృక్పథంలో మార్పులు కనిపిస్తున్నాయి. వీలైలనంత రెగ్యులర్ టచ్‌లో ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. సినిమా సినిమాకి గ్యాప్ ఇచ్చే మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా ‘విరామానికి’ విరామం ఇచ్చి… స్పీడు పెంచేస్తున్నారు. అయినప్పటికీ…. 2018లో కొంతమంది హీరోలు బద్దకించారు. వాళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కాకపోతే… ఈ క్యాలెండర్ ఇయర్ ని శూన్య హస్తాలతో పంచిపంచేశారు. వాళ్ల జాబితా ఒక్కసారి చూస్తే..
ప్రభాస్
ప్రభాస్ నుంచి సినిమా రావడం గగనం అయిపోయింది. బాహుబలి రెండు భాగాల కోసం నాలుగేళ్లు ఇచ్చేసి తన డెడికేషన్ ఏపాటిదో చూపించాడు ప్రభాస్. ఇప్పుడు రాబోతున్న చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నవే. ‘సాహో’ విడుదలకు కనీసం యేడాదిన్నర సమయం పడుతుందని ప్రభాస్ అభిమానులు కూడా గ్రహించేశారు. దానికి తగ్గట్టుగానే నిదానంగా తెరకెక్కుతోంది సాహో. అందుకే ప్రభాస్ నటించిన ఏ చిత్రమూ.. ఈ యేడాది రాలేదు. రాధాకష్ణ దర్శకత్వం వహించే చిత్రంతో పాటు సాహోని కూడా 2019లోనే విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2018లో సినిమా రాని లోటుని 2019లో ప్రభాస్ తీర్చేస్తాడు.
వెంకటేష్
అగ్ర కథానాయకులలో వెంకటేష్ ఒకడు. వినోద కథలు, కుటుంబ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. రీమేకులంటే మక్కువ ఎక్కువ. అలాంటప్పుడు కథల కోసం పెద్దగా వెదుక్కోవాల్సిన పని లేదు. తనకంటూ ఓ మార్కెట్ ఉంది కాబట్టి, నిర్మాతలు క్యూ కడతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లోనే ఓ నిర్మాణ సంస్థ ఉంది. మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ముందుండే కథానాయకుడు కాబట్టి.. ఖాళీగా ఉండే ఛాన్సే లేదు. కానీ.. 2018లో వెంకీ ఖాతాలో ఒక్క సినిమా కూడా పడలేదు. ‘గురు’ తరవాత.. గురుడు రిలాక్స్ అయిపోవడంతో వెంకీ నుంచి సినిమా రాలేదు. కాకపోతే ‘అజ్ఞాతవాసి’ కోసం ఒక్క సీన్లో కనిపించాడు. అది కూడా రిలీజ్ అయిన రెండు రోజుల తరవాత కలిపిన సీన్ అది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో… అజ్ఞాతవాసిలో వెంకీ నటించాడన్న విషయం కూడా ఫ్యాన్స్ మర్చిపోయారు. ఇప్పుడిప్పుడే… వెంకీ మళ్లీ బిజీ అయ్యాడు. తను నటించిన ‘ఎఫ్ 2’ ఈ సంక్రాంతికి రానుంది. ఆ వెంటనే నాగచైతన్యతో ఓ మల్టీస్టారర్ పట్టాలెక్కిస్తాడు. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేసే ఛాన్సుంది. కానీ.. అదెప్పుడో తెలీదు.
రానా
బాహుబలి తరవాత రానా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. సోలో హీరోగానూ… ‘నేను రాజు నేనే మంత్రి’ తో హిట్టు అందుకున్నాడు. కొత్త కథలు, కొత్త పాత్రలపై దృష్టి పెట్టే రానా.. 2018లో ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ‘పాన్ ఇండియా’ ఇమేజ్ అందుకోవాలన్న ఆత్రంగా ఉన్న రానా.. బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టాడు. అక్కడ హోస్ ఫుల్ 4లో నటించాడు. దాంతో పాటు రెండు త్రి భాషా చిత్రాలు (తెలుగు, తమిళ, మలయాళంలో) ఒప్పుకున్నాడు. ఇవి రెండూ సెట్స్ పైనే ఉన్నాయి. 2019లో ఈ రెండు చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో వాయిస్ ఓవర్ అందించిన రానా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు.
అఖిల్
అఖిల్, హలో.. రెండు సినిమాలూ ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ కెరీర్ డోలాయమానంలో పడింది. ఎలాంటి కథల్ని ఎంచుకోవాలి.. ఎలాంటి దర్శకుల్ని నమ్ముకోవాలి అనే సందిగ్థంలో 2018 గడిపేశాడు. ఈ యేడాది తను చేసిన ‘మిస్టర్ మజ్ను’ 2019 జనవరిలో విడుదల అవుతోంది. ఈసారి తన వయసుకి నప్పే ప్రేమకథ ఒప్పుకోవడం, తొలి ప్రేమతో ఆకట్టుకున్న వెంకీ ని దర్శకుడిగా ఎంచుకోవడం.. తెలివైన నిర్ణయాలని చెప్పొచ్చు. అయితే మిస్టర్ మజ్ను తరవాత అఖిల్ ఎవరితో జట్టుకట్టబోతున్నాడన్నది ఇంకా తేలలేదు. అఖిల్ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నాగ్.. ప్రస్తుతం అఖిల్ కోసమే కథలు వింటున్నట్టు టాక్.
రాజశేఖర్
రాజశేఖర్ అసలే లేజీ. పైగా ఫ్లాపుల్లో ఉన్నాడు. అందుకే తన దగ్గర్నుంచి సినిమాలు రావడం చాలా కష్టం. అయితే.. ‘గరుడ వేగ’ ఇచ్చిన ఉత్సాహంతో రాజశేఖర్ వరుసగా సినిమాలు చేస్తాడేమో అని ఆశించారు. కానీ… అదీ జరగలేదు. అందుకే 2018లో రాజశేఖర్ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. తను నటిస్తున్న ‘కల్కి’ 2019 వేసవిలో విడుదల అవుతుందని సమాచారం.