చిత్రసీమ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతుంది. అదేం తప్పు కూడా కాదు. హీరోని చూస్తే నిర్మాత ముందుకొస్తాడు. పంపిణీదారులు రిస్క్ చేసేదీ హీరోలపై ఉన్న నమ్మకంతోనే. అంతెందుకు..? ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్తేది కూడా హీరో కోసమే. వాళ్లెంత దూకుడుగా ఉంటే.. బాక్సాఫీసు అంత కళకళలాడుతుంటుంది. స్టార్ హీరోలపైనే పరిశ్రమ స్థాయి, సత్తా ఆధారపడి ఉన్నాయనడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. రికార్డు వసూళ్ల గురించి మాట్లాడేది అప్పుడే. తెలుగు సినిమా మార్కెట్ వందల కోట్లు దాటి పరుగులు పెడుతోందంటే…. అదంతా హీరోల పుణ్యమే. మరి ఈ యేడాది మన స్టార్ హీరోలు ఏం చేశారు? వాళ్ల పోగ్రెస్ రిపోర్ట్ ఏమిటి? పరిశ్రమకు వాళ్లిచ్చిన విజయాలేంటి? ఒక్కసారి రివైండ్ చేసుకుంటే..
చిరంజీవి
దశాబ్దాలుగా చిత్రసీమకు మూల స్థంభంగా నిలిచి మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి. రాజకీయాల్లోకి వెళ్లొచ్చినా… ఆయన వైభవం, స్టార్ డమ్ ఏమీ తగ్గలేదు. ‘ఖైది నెం.150’తో తన పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు చిరంజీవి. తొమ్మిదేళ్ల విరామం తరవాత వచ్చినా.. ఈ స్థాయిలో వసూళ్లు దక్కడం కేవలం చిరంజీవికే సాధ్యమనిపించింది. 2018లో చిరు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కాకపోతే.. ఆయన ‘సైరా’ పనుల్లో బిజీగా గడిపారు. ‘సైరా’ రూ.200 కోట్ల ప్రాజెక్టు. ఈ సినిమా ఆలస్యం అవుతుందని మెగా అభిమానులకూ తెలుసు. కాబట్టి.. వాళ్లూ సర్దుకుపోయారు. ఇండ్రస్ట్రీ పెద్దగా… కొన్ని ఆడియో ఫంక్షన్లలో మెరిశారు చిరు. ఆ విధంగా.. చిరు సినిమా రాలేదన్న లోటు కాస్తలో కాస్తయినా తీరింది.
మహేష్‌బాబు
బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి ఫ్లాపుల తరవాత… ఈ యేడాది మహేష్ బాబు తేరుకున్నాడు. ‘భరత్ అనే నేను’ తో సూపర్ డూపర్ హిట్ అందించి అభిమానుల్ని అలరించాడు. ఈ సినిమా వంద కో్ట్ల మైలు రాయిని అందుకుంది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు… మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నాడు మహేష్. మరో నాలుగైదు కథలు మహేష్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ యేడాది మహేష్ కి ప్రత్యేకం. ఎందుకంటే.. ఏఎంబీ పేరుతో థియేటర్ రంగంలోకి ప్రవేశించాడు మహేష్. ఇటీవలే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది.
ఎన్టీఆర్
రెండు మూడేళ్లుగా బాక్సాఫీసు దగ్గర జోరు చూపిస్తున్నాడు ఎన్టీఆర్. ఈసారీ.. ఎన్టీఆర్ హవా కొనసాగింది. ‘అరవింద సమేత వీర రాఘవ’తో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. బాక్సాఫీసు దగ్గర యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయినా.. ఎన్టీఆర్ నటన, పాత్రలో ఒదిగిపోయిన విధానం అభిమానులకు బాగా నచ్చాయి. అయితే.. ఈ యేడాది ఎన్టీఆర్ జీవితంలో మర్చిపోలేని దుర్ఘటన చోటు చేసుకుంది. తండ్రి మరణం.. ఎన్టీఆర్ ని కృంగదీసింది. ఆ విషాదంలోనూ అరవింద సమేత షూటింగ్లో పాలుపంచుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం.. రాజమౌళితో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.
ప్రభాస్
ఈయేడాది ప్రభాస్ నుంచి సినిమాఏం రాలేదు. అయితేనేం.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచాడు ప్రభాస్. దానికి తోడు షూటింగులతో బిజీగా గడిపేశాడు. సాహో ఓవైపు, మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మరోవైపు. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో సమాంతరంగా పాలు పంచుకోవడం ప్రభాస్ కెరీర్లో ఇదే మొదటిసారి. 2019లో మాత్రం ప్రభాస్ నుంచి 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. సాహోని ఆగస్టు 15న విడుదల చేస్తారు.
నాగార్జున
2018లో నాగార్జున నుంచి ‘ఆఫీసర్’, ‘దేవదాసు’ చిత్రాలొచ్చాయి. వర్మ దర్శకత్వం వహించిన ఆఫీసర్ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. అసలు ఈ సినిమాలో నాగ్ ఎందుకు నటించాడు? అనే ప్రశ్న రేగింది. నిర్మాతలు, పంపిణీదారులు ఈ సినిమాతో భారీగా నష్టపోయారు. ‘దేవదాస్’కి టాక్ బాగానే ఉన్నా.. వసూళ్లు మాత్రం నిరాశపరిచాయి. అశ్వనీదత్ ఈ కాంబినేషన్‌ని చూపించి సొమ్ములు చేసుకోగలిగినా.. బయ్యర్లు మాత్రం నష్టపోయారు. చాలా కాలం తరవాత.. బాలీవుడ్లో ఓ సినిమా ఒప్పుకున్నాడు నాగ్. అది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
వెంకటేష్
2018లో సినిమాలు చేయకుండా బద్దకించిన స్టార్ హీరోలలో వెంకీ పేరు కూడా ఉంది. గురు తరవాత ఆయన సినిమా ఏదీ విడుదల కాలేదు. ‘ఎఫ్ 2’.. ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది. ‘వెంకీ మామ’ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో ఇంకా తేలలేదు. సోలో హీరోగా సినిమాలు చేసే విషయంలో వెంకీ చాలా ఆలోచిస్తున్నాడు. తన వయసుకీ, ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కి మల్టీస్టారర్ చిత్రాలే నయం అన్నది తన అభిప్రాయం కావొచ్చు. 2019లోనైనా సోలో హీరోగా ఓ సినిమా మొదలెడతాడేమో చూడాలి.
బాలకృష్ణ
తెలుగు సినిమా క్యాలెండర్ బాలయ్య సినిమాలతోనే మొదలయ్యే ఆనవాయితీ 2018లోనూ కొనసాగింది. సంక్రాంతికి ‘జై సింహా’గా సందడి చేశాడు బాలకృష్ణ. అదే సీజన్లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ అట్టర్ ఫ్లాప్ అవ్వడం బాలకృష్ణ సినిమాకి బాగా కలిసొచ్చింది. టాక్ సోసో గా ఉన్నప్పటికీ, సంక్రాంతి సీజన్‌ని బాగానే క్యాష్ చేసుకోగలిగింది. ఆ తరవాత.. ఎన్టీఆర్ బయోపిక్ హడావుడిలో పడిపోయారు బాలయ్య. ఒకేసారి పార్ట్ 1, పార్ట్ 2ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. గత రెండు మూడు నెలల నుంచీ.. బాలయ్య కబుర్లే వినిపిస్తున్నాయి. ‘బుల్ బుల్’ కూడా బాలయ్య పేరు మార్మోగేలా చేసింది. ‘బలకృష్ణ అంటే ఎవరో నాకు తెలీదు’ అనే స్టేట్మెంట్లూ సంచలనం కలిగించాయి.
పవన్ కల్యాణ్
ఈ యేడాది పవన్ కబుర్లు సినిమాల కంటే.. రాజకీయ రంగంలోనే ఎక్కువగా వినిపించాయి. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పవన్ ఫుల్ బిజీ అవ్వడంతో.. సినిమాలపై ఫోకస్ పెట్టడం కుదర్లేదు. ఆయన్నుంచి ఈ యేడాది వచ్చిన ఒకే ఒక్క సినిమా అజ్ఞాతవాసి.. డిజాస్టర్ అయిపోయింది. ఆ నష్టాల్ని పవన్ కూడా కాస్త భరించాల్సివచ్చింది. డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. 2019 ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ పవన్ మరో సినిమా చేయడు. ఆ తరవాత… సినిమాలు చేస్తాడా, లేదంటే పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతాడా? అనేది పవన్ సైతం సమాధానం చెప్పలేని ప్రశ్నగా మిగిలిపోయింది. పవన్ ఒకానొక నిర్మాతగా వ్యవహరించిన.. ‘ఛల్ మోహన్ రంగ’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఎలా చూసినా.. ఈ యేడాది సినీ రంగంలో పవన్‌కి కలసి రాలేదనే చెప్పాలి.
రామ్ చరణ్
రామ్‌చరణ్ కెరీర్లోనే అతి పెద్ద విజయం ఈ యేడాదే దక్కింది. ‘రంగస్థలం’ బాక్సాఫీసుని షేక్ చేసేసింది. చిట్టిబాబుగా చరణ్ నటన అభిమానుల్ని అలరించింది. చరణ్‌లో ఇంత మంచి నటుడున్నాడా..?? అంటూ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే ‘వినయ విధేయ రామా’తో బిజీ అయిపోయాడు చరణ్. మరోవైపు ‘సైరా’కీ తనే నిర్మాత. అటు హీరోగా, ఇటు నిర్మాతగా ద్విపాత్రాభినయం చేయడం వల్ల.. చరణ్ కి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా పోయింది. అన్నింటికంటే ముఖ్యంగా రాజమౌళి మల్టీస్టారర్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది.
అల్లు అర్జున్
బన్నీని ఈయేడాది బాగా నిరాశపరిచింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఆ తరవాత మరో సినిమా మొదలెట్టడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా ఓకే అయినా, ఇంత వరకూ పట్టాలెక్కలేదు. ఇప్పుడు.. థియేటర్ రంగంలోకి బన్నీ అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. మహేష్ దారిలోనే ఓ మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.