అదృష్టం అంటే కథానాయికలదే. హిట్లూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటుంటారు. ఓసారి `స్టార్` అనే ముద్రపడితే… కోట్లకు కోట్లు పారితోషికాలు అందుతాయి. సినిమాలు తగ్గితే… ఐటెమ్ గీతాలు చేసుకోవొచ్చు. లేదంటే.. షాపింగు మాళ్లలో సందడి చేస్తూ… గంటకు ఇంత అంటూ లక్షలు గడించొచ్చు. అయితే తెలుగు, లేదంటే తమిళం. అదృష్టం బాగుంటే బాలీవుడ్‌కి చెక్కేయొచ్చు. ఇవేం లేక ఖాళీ అయితేపోతే… ‘మీటూ’ అంటూ ఏదో ఓ వివాదంలో తలదూర్చి… మళ్లీ వార్తల్లోకి రావొచ్చు. హీరోయిన్లంటే ఇన్ని లెక్కలున్నాయి. అయితే.. కేవలం సినిమాలపై ఫోకస్ చేస్తూ… విజయాలే లక్ష్యంగా దూసుకుపోతుంటారు కొంతమంది కథానాయికలు. వాళ్ల పోగ్రెస్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. మరి 2018లో మన కథానాయికల పోగ్రెస్ ఏమిటి?? వాళ్లు సాధించిన విజయాలేంటి? ఒక్కసారి రివైండ్ చేసుకుంటే…
అనుష్క
టాలీవుడ్లో నెంబర్ వన్ కథానాయిక ఎవరంటే ముందు అనుష్క పేరే గుర్తొస్తుంది. అటు కమర్షియల్ కథల్లో, ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో మెరుస్తుంటుంది. అత్యధిక పారితోషికం అందుకునే నాయికల్లో.. తనే ముందుంటుంది. అయితే ఈ యేడాది అనుష్క కేవలం ఒకే ఒక్క సినిమాతో సరిపెట్టుకుంది. ‘భాగమతి’ గా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరవాత.. తెలుగు సినిమాలేమీ ఒప్పుకోలేదు. చూస్తుంటే… తను హాలీడే మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.
తమన్నా
తమన్నా ఈ యేడాది రెండు సినిమాల్లో మెరిసింది. ‘నా నువ్వే’, ‘నెక్ట్స్ ఏంటి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండూ డిజాస్టర్లే. ‘కేజీఎఫ్’లో ఓ ప్రత్యేక గీతం చేసింది. ఆ పాటకు లభించిన ఆదరణ అంతంత మాత్రమే. తమన్నా ఆశలన్నీ ‘దటీజ్ మహాలక్ష్మి’పైనే ఉన్నాయి. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్‌కి ఇది రీమేక్. `సైరా` పైనా తమ్మూ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలే తమన్నా భవిష్యత్తుని నిర్దారిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సమంత
పెళ్లయ్యాక ఎందుకో సమంత కాస్త బద్దకించింది. ఇది వరకటిలా వేగంగా సినిమాలు చేయడం లేదు. ఈ యేడాది మాత్రం సమంత నుంచి మూడు సినిమాలొచ్చాయి. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూటర్న్’ మూడూ వైవిధ్యభరితమైన చిత్రాలే. మహానటి క్రెడిట్ అంతా కీర్తి సురేష్‌కే వెళ్లిపోయినా… అందులోనూ తనదంటూ మార్క్ చూపించగలిగింది. ఇక రామలక్ష్మి పాత్రలో సమంత చేసిన అభినయం ఇప్పట్లో మర్చిపోలేం. ‘యూ టర్న్’ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందివ్వలేదు.
కాజల్
వెటరన్ భామల లిస్టులో చేరిపోయిన కాజల్.. విచిత్రంగా ఇప్పుడు యువ కథానాయకులతో జోడీ కడుతోంది. ఈ యేడాది కాజల్ ‘అ’, ‘ఎం.ఎల్.ఏ’, ‘కవచం’ చిత్రాల్లో నటించింది. అ.. ప్రయోగంగా మిగిలిపోతే, ‘ఎం.ఎల్ఏ’ యావరేజ్ అయ్యింది. కవచం మాత్రం డిజాస్టర్ లిస్టులో చేరింది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. అదీ లేడీ ఓరియెంటెడ్ చిత్రమే. మరోవైపు తమిళ ‘క్వీన్’గా కనిపించబోతోంది.
రకుల్‌ప్రీత్ సింగ్
నవతరం కథానాయికల జోరుతో.. రకుల్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఈ యేడాది రకుల్ నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. టాప్ కథానాయికల్లో ఈ యేడాది ఒక్క సినిమా కూడా చేయని నాయిక.. రకుల్‌నే. హిందీలో ఓ సినిమా చేసింది గానీ… అది కూడా ఫ్లాప్ అయ్యింది.
కీర్తి సురేష్
తక్కువ సినిమాలతోనే స్టార్ హోదా దక్కించుకున్న నాయిక కీర్తి సురేష్. ఆమె కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా ‘మహానటి’ నిలిచిపోతుంది. సావిత్రి పాత్రకు కీర్తి ప్రాణ ప్రతిష్ట చేసిన విధానం విమర్శకులకూ నచ్చింది. ఈసినిమాతో కీర్తి ఒక్కసారిగా టాప్ లీగ్‌లోకి చేరిపోయింది. పవన్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయినా ఆ ప్రభావం తన కెరీర్‌పై ఏమాత్రం పడలేదు. తమిళంలో చేసిన ‘సర్కార్’, ‘పందెం కోడి 2’ తనకు మంచి విజయాలనే సాధించిపెట్టాయి.