ఒకానొక సమయంలో ఎన్టీఆర్ బయోపిక్‌కి రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. తరవాత వర్మ స్థానంలో ఆయన శిష్యుడు తేజ వచ్చారు. సినిమా ప్రారంభోత్సవం తరవాత… చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందు సినిమా నుంచి తేజ తప్పుకున్నారు. ఆయన స్థానంలో దర్శకుడిగా బాధ్యతలు చేపట్టిన క్రిష్ జాగర్లమూడి సినిమాను పూర్తి చేస్తున్నారు. ఈ నెల 30న ‘భైరవగీత’ విడుదల సందర్భంగా వర్మ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సినిమాను నిర్మించినది ఆయనే. ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదని లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నారా?’ అని వర్మను ప్రశ్నించగా అటువంటిది ఏమీ లేదన్నారు. “ఆ సినిమా (ఎన్టీఆర్ బయోపిక్) ప్రారంభ దశలో నా పేరు అనుకున్నారు. తరవాత ఎప్పుడూ కలవలేదు. ఆ సినిమా ఇవ్వలేదనే కారణంగా నేను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయడం లేదు. నాకు మొదటి నుంచి ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అంటే ఇంట్రెస్ట్. అందుకని తీస్తున్నా. ఎన్టీఆర్ బయోపిక్‌కి, మా సినిమాకు సంబంధం వుండదు” అని వర్మ తెలిపారు. బాలకృష్ణతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి మాట్లాడారా? అని ప్రశ్నించగా… “లేదు” అని బదులిచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర్నుంచి ఏయే పాత్రలు వున్నాయో… అన్ని పాత్రలూ సినిమాలో వుంటాయని ఆయన తెలిపారు. అంతా కొత్తవాళ్లతో సినిమాను తెరకెక్కిస్తున్నానని, జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నానని వర్మ స్పష్టం చేశారు.