వర్మ సమాధానాలు చెప్పేటప్పుడు మీడియా చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని మధ్యలో మరో మాట మాట్లాడితే.. అదే టాపిక్ మీద నెక్స్ట్ క్వశ్చన్ వేయడానికి వీల్లేకుండా వింతగా మాట్లాడతాడు. సాధారణంగా సినిమా ప్రముఖులను మీడియా ఆటాడుకుంటుంది. కాని వర్మ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయనే మీడియాని ఓ ఆట ఆడుకుంటాడు. ఎంత క్రిటికల్ క్వశ్చన్ వేసినా.. తలతిక్క సమాధానాలు చెప్పడం వర్మ స్టయిల్. ఎక్కువ టీవీ ఇంటర్వ్యూలలో కనిపించే వర్మ, తన ధోరణికి భిన్నంగా ‘ఆఫీసర్’ సినిమా గురించి తెలుగులో ప్రధాన దినపత్రికలను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పవన్‌కల్యాణ్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డి బూతుమాట ఉపయోగించడం, ఆమెను అలా తిట్టామని సలహా ఇచ్చింది తానేనని వర్మ ఒప్పుకోవడం, తరవాత అది కాస్తా పవన్‌కల్యాణ్ వర్సెస్ మీడియా వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అందులోనూ శ్రీరెడ్డి చేత పవన్‌కల్యాణ్‌ని తిట్టించినది తానేనని వర్మ స్వయంగా ఓ వీడియో విడుదల చేశాడేమో… ఆ టాపిక్ మీద ప్రశ్నలు వేశారు. ఎవరికి వారు విడివిడిగా వర్మను ఇంటర్వ్యూ చేసినా… ఆయన మాత్రం అందరికీ చెప్పిన సమాధానం ఒక్కటే. “శ్రీరెడ్డి వివాదంలో నేను చెప్పాల్సిందంతా చెప్పేశా. యూట్యూబ్‌లో నా వీడియోలు చూసుకోండి” అని. ఈ టాపిక్ కాకుండా మిగతా విషయాల్లో వర్మను మీడియా ఆడుకుంది. ఫ్లాపుల గురించి, సంచలనం కోసం పాకులాడే వర్మ మనస్తత్వం గురించి గుచ్చి గుచ్చి అడిగారు. ఇవన్నీ వదిలిస్తే… ‘ఆఫీసర్’ టీజర్స్, ట్రైలర్‌కి వచ్చిన డిస్‌లైక్స్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌కి ఇంకా పవన్ అభిమానులను నిందిస్తున్నాడు వర్మ. రేపు సినిమా ఫ్లాపయితే… దాన్ని కూడా పవన్ అభిమానుల ఖాతాలో వేసేసేలా కనిపిస్తున్నాడు.