రాంగోపాల్ వర్మ మంచి టెక్నీషియన్. తన సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి. వాటిని తెరకెక్కించే తీరు కూడా కొత్తగా ఉంటుంది. తన తొలి సినిమా శివ తోనే మ్యూజికల్ గా తన టేస్ట్ ఏమిటోచూపించేశాడు వర్మ. గోవింద – గోవింద, క్షణ క్షణం సినిమాలోనూ పాటలు అదిరిపోతాయి. రంగీలా అయితే ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్. ప్రపంచ సినిమా సంగీతంపై తనకంటూ ఓ అవగాహన ఉంది. తన దృష్టిలో ప్రపంచంలోనే అత్యుత్తమ గీతం ఒకటుంది. అదే.. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటల్లో ఇదొకటి. మోటివేషన్ గీతాల్లో.. ఈ పాటదే అగ్ర తాంబూలం. వర్మకి ఈ పాటంటే పిచ్చ ఇష్టం. ఈపాటలోని ప్రతీలైనూ తనకుగుర్తే.
”ప్రపంచ సాహిత్యంలో చాలా రకాలైన పాటలొచ్చాయి. ప్రపంచ భాషల్లో కొన్ని వేల లక్షల పాటలున్నాయి. వాటిలో నాకు తెలిసినంత వరకూ ఇదే ఉత్తమ మైన పాట” అంటూ ఈ పాటకు కితాబిచ్చాడు వర్మ. ఈ పాట విన్న తరవాత సీతారామశాస్త్రి పై తన గౌరవం రెట్టింపు అయ్యిందన్నాడు. అయితే.. ఈ పాట పిక్చరైజేషన్ మాత్రం తనకు అస్సలు నచ్చలేదట. ఈపాటని ‘పట్టుదల’ చిత్రం కోసం రాశారు సీతారామశాస్త్రి. సుమన్ పై ఈపాటని తెరకెక్కించిన తీరు చూస్తే, చచ్చిపోవాలనిపిస్తుందని కౌంటరేశాడు వర్మ. ఈ పాట బాహుబలి స్థాయిలో పెద్దగా ఉండాలని, కానీ.. పాడు చేశారని బాధపడిపోయాడు. విచిత్రం ఏమిటంటే.. సీతారామశాస్త్రి పాటల రచయితగా తొలి అడుగు వేసిన ‘సిరివెన్నెల’ సినిమాలో ఒక్క పాట కూడా వర్మ వినలేదట. ”అలాంటి పాటలకు ఇష్టపడే మైండ్ సెట్ నాది కాదు. అందుకే ఇప్పటి వరకూ సిరివెన్నెల సినిమాలో ఒక్క పాట కూడా వినలేదు” అని చెప్పుకొచ్చాడు వర్మ.