దెయ్యాల్ని చూపించి ప్రేక్షకుల్ని భయపెట్టాలనుకునే వర్మ… తొలిసారి దేవుళ్లని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశాడు.
వర్మ ఏం చేసినా – అందులో బోలెడంత తిక్క కనిపిస్తుంటుంది. ఆ తిక్కకే తిక్కలేచేంత అద్భుతం ఈ రోజు పొద్దుటే జరిగిపోయింది. ఎప్పుడూ చిరిగిన జీన్సు, నలిగిన టీషర్టూ వేసుకుని ట్రెండీగా కనిపించే వర్మ… ఈసారి చాలా సంప్రదాయకమైన దుస్తుల్లో దర్శనమిచ్చాడు. మెడలో ఎర్రటి శాలువా.. చేతిలో తిరుపతి లడ్డూతో వర్మని చూసి జనాల కళ్లు బైర్లు కమ్మాయి. అసలింతకీ ఇది వర్మ ఫొటోనేనా, లేదంటే గ్రాఫిక్సా… అనే అనుమానం కూడా కలిగింది. అది వర్మదే అని, తిరుపతిలో దైవ దర్శనం చేసుకున్న తరవాత వర్మ వదిలిన ఫొటో అని నిర్థారించుకున్న తరవాత… చాలామంది వర్మ భక్తులు ఆ ఫొటోని విపరీతంగా షేర్ చేయడం మొదలెట్టారు. దానికింద బోలెడన్ని కామెంట్లు సెటైర్లు.
వర్మ నాస్తికుడు. ఈవిషయం మళ్లీ గుర్తు చేయాల్సిన పని లేదు.
బర్త్డే చేసుకోడు. అదేంటని అడిగితే.. – పుట్టడం గొప్పేంటి? బురదలో పంది కూడా పుడుతుంది అని లైట్ తీసుకుంటాడు.
పూజలు, పునస్కారాలు, దేవుడికి దండం పెట్టుకోవడం – ఇవన్నీ ఆయన దృష్టిలో పాపాలు.
దేవుడు దిగి వచ్చి వర్మతో వాదన పెట్టుకున్నా… `దేవుడు లేడు` అని దేవుడితోనే చెప్పించగల సమర్థుడు. ఆ విషయంలో తిరుగులేదు.
అలాంటి వర్మ ఈరోజు భక్తుడిగా అవతారం ఎత్తడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదోరకమైన పబ్లిసిటీ ట్రిక్కు అన్నది జనాలకు తెలియంది కాదు.
కానీ తిరుపతిలో అడుగుపెట్టి, లడ్డూని చేత బట్టి. నుదుటన బొట్టు పెట్టి – పరమ పవిత్రమైన భక్తుడిగా అవతారం ఎత్తిన వర్మ.. తిరుమల వెంకటేశుడ్ని ఏ విధంగా వాడుకుంటాడా అన్నది ఆసక్తిగా మారింది.
వర్మ ఏం చేసినా వాటి వెనుక బోలెడంత స్ట్రాటజీ ఉంటుంది. వర్మ గుడిలో అడుగు పెడితే జనాలు ఏం మాట్లాడుకుంటారో తనకు తెలుసు. తిరుపతిలో `లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్న వర్మ… ప్రెస్ మీట్ సమయానికి అందరి దృష్టీ తనవైపుకు తిప్పుకోవడానికి ఈ మార్గం ఎంచుకుని ఉంటాడన్నది అందరిలోనూ కలుగుతున్న అనుమానం. అక్కడితో వర్మ ఆగుతాడా..?? లేదంటే ఇంకాస్త ముందుకెళ్లి కొత్త రకమైన ట్వీట్లతో, వేడి వేడి వివాదాలు సృష్టించడానికి మాస్టర్ ప్లాన్ వేశాడా??? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
ప్రస్తుతానికైతే వర్మకీ, ఆయన భక్తికీ, చేతిలో లడ్డూకీ, ముఖ్యంగా ఆ స్టిల్ కీ శతకోడి దండాలు!!