శివతో ఓ సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. ఆ తరవాత రామూ నుంచి ఎన్నో అద్భుతాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగిన సినిమాలు చేయడం లేదు వర్మ. ఆ సంగతి వర్మకీ తెలుసు. సినిమాల కంటే మిగిలిన విషయాలపై దృష్టి పెట్టి, తన ఇమేజ్‌కి డామేజ్ కలిగించే వెటకారాలు చాలా చేశాడు, చేస్తున్నాడు. ఇప్పుడు వర్మ ఎన్ని సినిమాలు చేసినా.. ఇదివరకటి ఫోకస్ లేదు, అంత గుర్తింపూ రావడం లేదు. అయితే… ఇప్పుడు నాగార్జునకి ఓ కథ చెప్పి, ఒప్పించి పట్టాలెక్కించేశాడు. నాగ్ – వర్మ కాంబో అంటే శివ నాటి రోజులు గుర్తుకు రావడం ఖాయం. ఈ కాంబోకి ఇంకా క్రేజ్తగ్గలేదు. దాంతో వర్మ ఫామ్ లోకి రావడానికి ఓ మార్గం దొరికినట్టైంది. ఈరోజే అన్నపూర్ణ స్డూడియోలో, వర్మ స్టైల్‌కి తగ్గట్టు వినూత్నంగా ఈ సినిమా మొదలైంది. ఎప్పటిలా.. వర్మ మాటల్లో తన జోరు చూపించాడు. ”నా మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మైండ్ దొబ్బిన మాట నిజమే, కానీ జ్యూస్ అయిపోయిందో లేదో ఈ సినిమాతో తేలిపోతుంది” అని కాన్ఫిడెన్స్ చూపించాడు.
తనకి దేవుడిపై నమ్మకంలేదని, తన దేవుడు నాగార్జుననే అని – చెప్పుకొచ్చాడు వర్మ. తనకేమాత్రం అనుభవం లేకపోయినా, నిజాయతీ నచ్చి అవకాశం ఇచ్చాడని, ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం అందించాడని, అందుకే నాగ్ తనకు దేవుడని, ఈ సినిమాతో హిట్ కొట్టి తీరతామని వర్మ ధీమాగా చెబుతున్నాడు. నాగ్ కూడా ఇంతే కాన్ఫిడెన్స్ చూపించాడు. ”శివ హిట్ అవుతుందని అనుకోలేదు. ఇప్పుడూ ఈ సినిమా హిట్ అవుతుందని అనుకోవడం లేదు. కానీ మా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి చాలా నమ్మకం ఉంది. ప్రతీ 28 ఏళ్లకు మెచ్యూరిటీ లెవిల్స్ పెరుగుతాయని నాన్నగారు చెబుతుంటారు. నా 28వ యేట శివ వచ్చింది. ఇప్పుడు మరో 28 యేళ్లు గడిచాయి. అంటే మెచ్యూరిటీ డబుల్ అయ్యింది. ఆ నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకొన్నా” అంటున్నాడు నాగ్. ఇదే ఉత్సాహం సినిమా విడుదల అయ్యేంత వరకూ ఉంటే మరో శివ రావడం గ్యారెంటీ.