రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట నేడు హాజరు కానున్నారు . ముందస్తు బెయిల్ షరతుల ప్రకారం ఆయన విచారణకు సహకరించాలి. పోలీసులు విచారణకు నోటీసులు ఇచ్చినప్పుడు తనకు ఆ రోజు కాల్షీట్లు లేవని కబుర్లు చెప్పారు. ఏడో తేదీన వస్తానని సమాచారం ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ రావాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టు చేసే అవకాశం లేదు కాబట్టి ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
జగన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని కూటమి నాయకులపై అత్యంత అసభ్యకరమైన భాషతో ట్వీట్లు పెట్టారని ఆయనపై కూటమి కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని, లోకేష్ ను ఆయన తీవ్రంగా అవమానించారు. ఆయన ఏపీలో కనిపిస్తే దాడులు చేసే ప్రమాదం ఉంది. అందుకే ఆయన సీక్రెట్ గా ఒంగోలు చేరుకునే అవకాశం ఉంది. పోలీసులు ఆయనకు భద్రత కల్పించనున్నారు.
పోలీసులు ఆర్జీవీ విషయంలో చాలా వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నేతలతో చేసిన ఆర్థిక లావాదేవీలు, వారు పంపించిన కంటెంట్ ను పోస్టు చేయడం..తన ట్విట్టర్ అకౌంట్ ను వైసీపీ వారికి అప్పగించడంతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు వేయనున్నారు. ఫైబర్ నెట్ డబ్బులు కొట్టేసిన వ్యవహారంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద డబ్బులు లేవని ఆయన చెబుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫైబర్ నెట్ ఎండీ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ విచారణ హాట్ టాపిక్ అవుతుంది.
ఆర్జీవీ ఒక వేల విచారణకు హాజరు కాకపోతే ఆయన బెయిల్ రద్దు పిటిషన్ పోలీసులు దాఖలు చేసి అనుమతి తీసుకుని అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి.