ఇది వరకు వర్మ అంటే ఓ సంచలనం. ప్రభంజనం. ఆయన్ని, ఆయన తీసిన సినిమాల్నీ చూసి దర్శకులు కావాలన్న ఆశలు గుండెల నిండా నింపుకుని – ఫిల్మ్‌నగర్‌లో దిగిపోయిన వాళ్లెంతో మంది. వర్మ ఫ్లాపులు తీసినా – తిక్క తిక్క స్టేట్మెంట్లు ఇచ్చినా, విలువలు లేని సినిమాలు తీసినా – వర్మపై ఎవరికీ ఇసుమంత ప్రేమ కూడా తగ్గలేదు. అది వర్మ ఆటిట్యూడ్ అనుకున్నారు. ఇంకా ఇంకా ప్రేమించారు.
అయితే అలా ఇష్టపడినవాళ్లే వర్మని చూసి జాలి పడుతున్నారిప్పుడు. వర్మేంటి.. మరీ ఇంతిలా దిగజారిపోయాడని వాపోతున్నారు. ‘బ్యూటిఫుల్’ సినిమాని ప్రమోట్ చేయడానికి వర్మ పడుతున్న తంటాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వర్మ డాన్సులు చేశాడు. వచ్చీ రానీ మూమెంట్స్‌తో – నవ్వించాడు. కాకపోతే అది వర్మలో కొత్త కోణం. తన హుందాతనం, తనకున్న డిగ్నిటీ స్టేజ్ మీద కూడా పక్కన పెట్టేశాడు. జనం మధ్య కుప్పి గంతులు వేస్తున్న వర్మని చూసి ఆయన అభిమానులు కమ్ భక్తులు జాలి పడడం మినహా మరేం చేయలేకపోతున్నారు.
నిన్నటికి నిన్న వర్మ ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. తాగడం, తినడం, డాన్స్ చేయడం ఇదీ ఆ పార్టీలో జరిగింది. దాన్ని లైవ్‌లో చూపించేశాడు. ఓ ప్రైవేటు పార్టీని లైవ్ లో చూపించడం వర్మకే సాధ్యం అన్నట్టు బిల్డప్పు ఇచ్చి, మీడియాని సైతం ఆహ్వానించారు.ఆ పార్టీలో వర్మ తాగుతూ, తూలుతూ.. హీరోయిన్ నైనా గంగూలీతో చేసిన విన్యాసాల గురించి ఏమని చెప్పాలి? ఓ సందర్భంలో నయన కాళ్లపై పడిపోయాడు కూడా. ఇది వర్మలోని దిగజారుడుతనానికి పరాకాష్ట. మద్యపానం, ధూమపానం సినిమాల్లో చూపించడానికే సవాలక్ష విధాలుగా ఆలోచిస్తున్నారు. ఆ పార్టీని లైవ్‌లోకి తీసుకొచ్చి, హీరోయిన్ చేత అర్థ నగ్న ప్రదర్శనలు చేస్తూ.. ఆ డాన్సుల్లో నిర్మాతలతో పాటు తానూ చేరి, కుప్పిగంతులు వేస్తూ, దాన్ని కూడా పబ్లిసిటీగా వాడేసుకున్నాడు వర్మ. దేశం గర్వించదగిన సినిమాలు తీసిన వర్మ ఓ హీరోయిన్ కాళ్ల ముందు మోకరిల్లడం – దీనికి పరాకాష్ట. వర్మ ఇంకేమైనా దిగజారిపోతాడా అనే భయం ఇప్పుడు లేదు. ఎందుకంటే.. ఇంతకంటే జారిపోవడానికి ఇంకేం మిగల్లేదిక్కడ.