ఆర్జీవీ అంతే. ఎక్కడ కెలకాలో అక్కడ కెలుకుతాడు. పైగా తన సినిమా విడుదల అవుతుంటే… ఆ కెలుకుడు కార్యక్రమం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. `క్లైమాక్స్` అనే సినిమాని ఇప్పుడు ఆన్లైన్లో విడుదల చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సినిమా గురించి జనం ఏమీ మాట్లాడుకోవడం లేదు. అందుకే.. ఎప్పటిలా కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చి, ముందు జనం తన గురించి మాట్లాడుకునేలా చేసి, ఆ తరవాత.. సినిమా గురించి ఆలోచించేలా.. కొన్ని స్టేట్మెంట్లు గుప్పిస్తున్నాడు. `ఇండ్రస్ట్రీ మొత్తం ఏకతాటిపై రావడం పచ్చి బూతు, అసలు వీళ్లలో ఐకమత్యమే లేదు` అంటూ ఓ టీవీ ఛానల్లో తనదైన స్టైల్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు వర్మ. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్ ఫ్లాప్ అయితే.. జనం రోడ్ల మీదకు వచ్చి షాంపైన్‌తో స్నానాలు చేస్తారు` అంటూ ఇంకోటి వదిలాడు. ఎవరికైనా ఓ పెద్ద హిట్టు పడితే జనాలు ఓర్వరని, అసూయతో చూస్తుంటారని, పక్కోడి సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటారని, ఆర్.ఆర్.ఆర్నీ అలానే చూస్తున్నారని, ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇండ్రస్ట్రీలో చాలామంది పండగ చేసుకుంటారని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఇలాంటి కామెంట్లే ఆర్జీవీపై ఫోకస్ పడేలా చేస్తుంటాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్తో ఇంకోసారి వార్తల్లో నిలిచిపోయాడు వర్మ. ఆ రకంగా తన టార్గెట్‌ని చేరినట్టే.