రేటింగ్: 1.5/5
ముందు నుంచీ ఆర్జీవీకి దెయ్యం సినిమాలంటే చాలా ఇష్టం. కెరీర్ మొదలెట్టిన కొత్తలో `రాత్రి` అనే సినిమా తీసి అందరినీ భయపెట్టాడు. అప్పట్లో దెయ్యం సినిమాలు కొత్త. ఆర్జీవీ వాటిని చూపించిన విధానం కూడా కొత్తే. కాబట్టి.. రాత్రి, దెయ్యం లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ తరవాత.. దెయ్యం సినిమాలు తీస్తూనే సాగాడు. ఇలాంటి కథలకు పెద్దగా స్టార్ కాస్టింగ్ అవసరం లేకుండా పోవడం, బడ్జెట్ పరిమితుల్లోనే ఉండడంతో.. వర్మ ఈ దారిని ఎంచుకున్నాడేమో..? ఇప్పుడు మరో `దెయ్యం` సినిమా తీసి వదిలాడు. ఎప్పుడో `పట్టపగలు` పేరుతో మొదలెట్టిన సినిమా… ఆగి, ఆగి `ఆర్జీవీ దెయ్యం`లా పేరు మార్చుకొచ్చింది. మరి ఈ దెయ్యం కథేమిటి? ఏ రీతిలో భయపెట్టింది?
శంకర్ (రాజశేఖర్) ఓ మెకానిక్. కూతురు విజ్జీ (స్వాతి దీక్షిత్) అంటే.. ప్రాణం. వాళ్లదో సామాన్యమైన కుటుంబం. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న తరుణంలో.. విజ్జీలో అనూహ్యమైన మార్పులొస్తాయి. పిచ్చి పిచ్చిగా అరవడం, కేకలు వేయడం, గొంతు మార్చి మాట్లాడడం చేస్తుంటుంది. విజ్జీ శరీరంలోకి ఆత్మ ప్రవేశించిందన్నది అందరి నమ్మకం. డాక్టర్ల దగ్గరకు వెళ్లినా లాభం ఉండదు. విజ్జీ శరీరంలో ఉన్న ఆత్మ.. గురు అనే వ్యక్తిది అని తెలుస్తుంది. గురు ఎవరు? విజ్జీ ఆత్మని ఎందుకు ఎంచుకున్నాడు? ఆ ఆత్మలోకి ప్రవేశించాక… ఏం చేశాడు అనేది మిగిలిన కథ.
వర్మ ఎప్పుడూ కథల గురించి పట్టించుకోడు. దెయ్యం కథలకు పెద్దగా కథలు కూడా అవసరం లేదు. ఆ భయం అనే ఎలిమెంట్ ఉంటే చాలు. ఇక్కడా అదే ఎలిమెంట్ ని పట్టుకోవాలని చూశాడు. రాత్రుళ్లు.. చిమ్మ చీకట్లో… తల విరబూసుకుంటూ వచ్చే దెయ్యాల కథలు చాలా చూశాం. ఈసారి… `పట్టపగలు` భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే… భయం అనే మూడ్ క్రియేట్ చేయడానికి రాత్రి నేపథ్యమే బలమైనది అనిపిస్తుంటుంది.. సినిమా చూస్తున్నప్పుడల్లా.
వర్మని చూసి చాలామంది హారర్ సినిమాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. వాళ్లు కొత్త తరహా టెక్నిక్కులతో భయపెడుతున్నారు. వాళ్లందరికీ ఓ రకంగా వర్మ గురువు. అయితే.. ఈ గురువు ఇంకా పాత పద్ధతిలోనే ఫాలో అవ్వడం, అవే కెమెరా ట్రిక్కుల్ని మాటి మాటికీ వాడడం చూస్తుంటే.. వర్మపై జాలి, వగైరా వగైరా వేస్తుంటాయి. దెయ్యం కథలకు కథ అవసరం లేదు. కానీ కాస్త ఎమోషన్, ఓ చిన్న థ్రెడ్, ఒకటో, రెండో ట్విస్టులు అవసరం. అవన్నీ ఉంటేనే హారర్ కథకు ఇంకాస్త ఎలివేషన్ లభిస్తుంది. అవి.. వర్మ పట్టించుకోలేదు. ప్రధాన పాత్ర (స్వాతి దీక్షిత్) తో గట్టిగా అరిపించడం, తండ్రి (రాజశేఖర్) ఆ అమ్మాయిని ఓదార్చడం తప్ప.. తొలి సగంలో మరో సన్నివేశమే కనిపించదు. నిజానికి ఇలాంటి సన్నివేశాలు వర్మ తన పాత సినిమాల్లోనే చూపించేశాడు.
సైకో కిల్లర్ గురు ఆత్మ విజ్జీ శరీరాన్నే ఎందుకు ఎంచుకుంది? అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా? అనే విషయాలు చూపించలేదు. విజ్జీ ప్రవర్తన చూసి వైద్యులు విస్మయానికి గురవ్వడం, భూత వైద్యులు నిమ్మకాయలు, మంత్రాలు చదువుతూ హాహాకారాలు చేయడం… ఇదీ ద్వితీయార్థం సాగే తీరు. సినిమా షూటింగ్ లో బ్రేకులు పడ్డాయి, ఈ సినిమా ఇప్పటిది కాదు, అనే విషయాలు తెరపై కూడా అర్థమైపోతూ ఉంటాయి. ఆహుతి ప్రసాద్ లాంటి దివంగత నటుల్ని చూసినప్పుడల్లా.. పాత సినిమాని మళ్లీ ఓసారి వెండి తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
రాజేంద్ర ప్రసాద్ కి వర్మ దర్శకత్వంలో చేయాలన్న కోరిక ఉండి ఉంటుంది. అది తీర్చుకోవడానికి ఈసినిమా చేసేశాడు. అంతే తప్ప… తన పాత్రకంటూ ఓ ప్రత్యేకత ఏమీ లేదు. రాజశేఖర్ బదులు ఎవరు కనిపించినా, పెద్దగా తేడా ఉండేది కాదు. స్వాతి దీక్షిత్ బాగా అరవగలిగింది (ఈ పాత్ర చేసింది ఇదే). తనికెళ్ల భరణి.. అనితాచౌదరి, సన.. మిగిలిన పాత్రల్లో `కనిపించారు`. టెక్నికల్ గా వర్మ సినిమాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ.. `దెయ్యం`లో ఆ మెరుపులూ లేవు. అలవాటైన కెమెరా యాంగిల్స్ తప్ప.. ఇంకేం ఉండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్నిసార్లు భయపెట్టించగలిగింది.
సాధారణంగా `మనుషులకు దెయ్యం పట్టింది` అంటుంటారు. కానీ వర్మ మాత్రం `దెయ్యాలను పట్టాడు`. ఆ దెయ్యాల్ని ఎప్పుడు వదులతాడో అర్థం కాదు. ఎందుకంటే.. ఈ తరహా సినిమాలు చూసీ చూసీ జనాలకు మొహం మొత్తేసింది. ఈ సినిమా రిజల్ట్ చూసైనా… వర్మ కాస్త వాస్తవంలోకి వస్తాడేమో చూడాలి.
రేటింగ్: 1.5/5