హైదరాబాద్: హారర్, థ్రిల్లర్ సినిమాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన రాంగోపాల్ వర్మ పేరుతో ఇప్పుడొక కాక్టైల్ వచ్చింది. జుబ్లీ హిల్స్‌లోని కాక్టైల్ లాంజ్ రెస్టారెంట్ ఆర్జీవీ పేరుతో ఆర్జీవీ ఎలిక్సిర్ అనే కొత్త కాక్‌టైల్‌ను రూపొందించింది. దీనిని నిన్న రాత్రి వర్మే ఆవిష్కరించారు. ప్రతి తెలుగువాడూ గర్వించే జాతీయస్థాయి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు గౌరవ సూచకంగా దీనిని ఆవిష్కరిస్తున్నట్లు లాంజ్ యాజమాన్యం తెలిపింది. ఆయన పేరుతో ఈ కాక్టైల్ ఆయన చేతులమీదుగా ప్రారంభం కావటం తమకు గర్వకారణంగా ఉందని పేర్కొంది. ఈ కాక్టైల్ తొలిగ్లాస్ను వర్మే అందుకున్నారు. తనపేరిట కాక్టైల్ మిక్స్ చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యం కలిగిందని వర్మ చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి, కోన వెంకట్, బ్రహ్మాజీ, నిఖిల్, సందీప్ కిషన్, నవదీప్, రాజ్ తరుణ్, నందు, బీవీఎస్ రవి, పృథ్వీ, సత్యం రాజేష్, సప్తగిరి, రాజా రవీంద్ర, శ్రీనివాసరెడ్డి, లగడపాటి శ్రీధర్, మధుశాలిని, తేజస్వి, నికిత, స్వాతి, అనితా చౌదరి, గజల్ శ్రీనివాస్, సుబ్బరాజు, మధురా శ్రీధర్, రఘు కుంచె, జర్నలిస్ట్ సిరాశ్రీ, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
మామూలుగా రాంగోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్‌లకు స్క్రూడ్రైవర్(ఓడ్కాతో ఆరెంజ్ జ్యూస్ కలిపి చేసే మిశ్రమం) కాక్టైల్ ఇష్టమని, వారు రెగ్యులర్‌గా దానినే తీసుకుంటారని చెబుతుంటారు. మరి ఈ కాక్‌టైల్‌ను ఏ ఏ మద్యాలు కలిపి చేశారో తెలియాల్సిఉంది.