యాంటీ బాలీవుడ్ ట్రెండ్ కొనసాగుతోంది. బాలీవుడ్ సినిమాల్ని, అక్కడి హీరోల్నీ బాయ్ కాట్ చేయడం ఓ ఉద్యమంలా మారుతోంది. ఈ జాబితాలో.. బ్రహ్మాస్త్ర ఒక్కటే తప్పించుకోగలిగింది. మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. బాయ్ కాట్ తో పాటుగా…. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో దారుణమైన డిజాస్టర్లు తగిలాయి. అయితే… బాలీవుడ్ హీరోల ఆటిట్యూడ్ కూడా.. ఈ బాయ్ కాట్ ఉద్యమానికి ఓ కారణమంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు వర్మ. తెలుగు హీరోలు చాలా వినమ్రంగా ఉంటారని, బాలీవుడ్ హీరోలు ఆటిట్యూడ్ చూపిస్తారని, మీడియా ముందు పొగరుగా మాట్లాడతారని, ఈ తేడాని బాలీవుడ్ జనాలు కనిపెట్టారని, అందుకే.. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు తమ వినమ్రతతో.. బాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొన్నారని, ఇప్పుడు తెలుగు హీరోల్ని బాలీవుడ్ కాపీ కొడుతోందని వ్యాఖ్యానించారు.
విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ విషయం గురించి ప్రస్తావిస్తూ ”విజయ్ ముందు నుంచీ అలానే ఉన్నాడు. తన ఆటిట్యూడే తనని స్టార్‌ని చేసింది. అయితే ఇప్పుడు తనది కూడా రాంగ్ టైమింగే. ఎందుకంటే బాలీవుడ్ లో ఆటిట్యూడ్ ఉన్న హీరోల్ని.. అక్కడి ప్రేక్షకులు ఆదరించడం లేదు. వాళ్లకు ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్‌లా వినమ్రంగా ఉండే హీరోలే నచ్చుతున్నారు. పైగా ఒకరు ఎదుగుతోంటే ఈర్ష్య, అసూయతో ఓర్వలేని జనాలు పోగైపోతారు. వాళ్లు నెగిటీవ్ ట్రోలింగ్స్ తో కార్నర్ చేస్తారు.. విజయ్ విషయంలో ఇదే జరిగింది” అని చెప్పుకొచ్చాడు వర్మ.