ఇప్పుడంటే రాంగోపాల్ వర్మ మనకు చీప్ అయిపోయాడు గానీ… తెలుగు సినిమాపై, ఆ మాటకొస్తే ఇండియన్ స్క్రీన్‌పై వర్మ చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఓ కథ చెప్పడం, పాత్రల్ని సృష్టించడం, వాస్తవ గాథల్ని సినిమాలుగా మార్చడం, దెయ్యం కథలు, స్టడీ కెమెరా, సౌండ్ ఎఫెక్ట్, 5డీ ఇలా ఒకటా రెండా ఎన్నో విప్లవాత్మక మార్పులు వర్మతోనే సాధ్యమయ్యాయి. శివ, సత్య, రంగీలా, సర్కార్.. ఇలా క్లాసిక్కులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. కానీ అదే వర్మ నుంచి నాశిరకం సినిమాలు ప్రవాహంలా వచ్చి పడిపోయేసరికి వర్మ ఎఫెక్ట్, మార్క్ ఇవన్నీ కనుమరుగైపోయాయి. వర్మ అంటే పీల్చి పిప్పి చేసిన సరుకు గుర్తొస్తుంది. ట్విట్టర్లో పనీ పాటా లేకుండా కూసే కూతలే వినిపిస్తాయి. వాడ్కా తాగిన మైకపు మాటలే గుర్తొస్తాయి. ‘నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమాలు తీస్తా. నచ్చితే చూడండి. లేకపోతే లేదు’ అనే మొండి మాటలే రింగు రింగులుగా తిరుగుతాయి. అలాంటి వర్మ తొలిసారి మారినట్టు అనిపిస్తోంది. ‘ఇక మీదట మంచి సినిమాలూ, గర్వపడే సినిమాలే తీస్తా..’ అంటూ ఒట్టేశాడు. తనపై, తనకు బ్రేక్ ఇచ్చిన నాగార్జునపై.
వర్మ సినీ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకోవడానికి అన్నట్టు హైదరాబాద్‌లో శివ టూ వంగవీటి అంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తనలోపాల్ని కూడా ఒప్పుకొన్నాడు. రాళ్లు విసిరుకొంటూ వెళ్తే ఏదో ఒకటి తగలకపోతుందా అన్నట్టు సినిమాలు తీశానని, అందుకే సరిగా ఆడట్లేదని ఎట్టకేలకు ఒప్పుకొన్నాడు వర్మ. అయితే వంగవీటి తనకు చాలా స్పెషల్ అని, ఇక మీదట గర్వపడే సినిమాలే తీస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మాట ఎవరూ నమ్మరని తనని లైట్ తీసుకొంటారేమో అని రాజమౌళి, నాగార్జునలపై ఒట్టు వేశాడు. ‘నాకు దేశం, సమాజం, కుటుంబంపై నమ్మకం లేదనుకొంటుంటారు. అందుకే నామీద నేనే ఒట్టువేసుకొని చెబుతున్నా.. నాకంటే ఎక్కువ ఇష్టపడే నాగార్జున మీద ఒట్టు. ఈసారి మాట మీద నిలబెడతా.. ఫలితం మీరే చూస్తారు’ అని కాస్త నమ్మకంగానే చెప్పుకొచ్చాడు వర్మ. సో… ఈసారి నమ్మి తీరాల్సిందే అన్నమాట.