ప్రస్తుతం పవర్ స్టార్ పేరిట పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ కూడా డబ్బులు వసూలు చేయాలని ముందుగా భావించినప్పటికీ, తన స్టాఫ్ ట్రైలర్ లీక్ చేయడం వల్ల యూట్యూబ్ లో ట్రైలర్ ను ఫ్రీగా విడుదల చేస్తున్నాం అని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ కు డబ్బులు పెట్టడం పై ప్రజల నుండి స్పందన బొత్తిగా లేకపోవడంతో దానిని ఫ్రీ గా విడుదల చేయాలని వర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా కూడా ఇలాగే ఎవరు చూడరా ఏమో అన్న అనుమానం వచ్చిందో ఏమో కానీ ఇటీవల ఓ టి టి ప్లాట్ఫామ్ మీద తీసిన మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కు చాలా ఎక్కువగా ప్రమోషన్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఆ ప్రమోషన్లో భాగంగా వేర్వేరు చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్న రామ్ గోపాల్ వర్మ కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానం లో భాగంగా బాత్రూం లో బాబాయ్ టైటిల్ తో తన తదుపరి సినిమా తీయడం గురించి చర్చ జరిగింది. వివరాల్లోకి వెళితే..
రామ్ గోపాల్ వర్మ పిరికి వాడా అంటూ ప్రశ్నించిన యాంకర్లు:
రాంగోపాల్ వర్మకు ఈ ఇంటర్వ్యూలలో ప్రధానంగా ఎదురైన ప్రశ్న- పెద్ద పెద్ద మాఫియా డాన్ ల మీద సినిమాలు తీసినప్పుడు సైతం వారి పేర్లు చెప్పి మరీ ధైర్యంగా తీసిన వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి వంటి సినిమాలు తీసినప్పుడు, పేర్లు ప్రకటించి మరీ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ, ఈసారి ఎందుకని ధైర్యంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సినిమా తీశానని చెప్పలేక పోతున్నాడు అన్నది. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కూడా ఇది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తీసిన సినిమా అని నేరుగా ప్రకటించడం లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ కు ఎదురైన రెండవ ప్రశ్న – టిడిపి జనసేన నేతలను ప్రధానంగా టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ కు అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మద్దతు, ఫండింగ్ ఉందా అన్నది. దీనికి కూడా వర్మ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఉన్నా కూడా తాను టీవీ ఛానల్ లో ఎందుకు బయట పెట్టుకుంటానని ఎదురు ప్రశ్న వేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే యాంకర్లు కూడా మొత్తానికి పరోక్షంగా మీరు వైయస్సార్సీపి ఫండింగ్ ఉందని అంగీకరిస్తారా అని తిరిగి ప్రశ్నించారు.
బాత్రూం లో బాబాయ్, కోడి కత్తి టైటిల్స్ తో సినిమాలు తీస్తారా అని ప్రశ్నించిన యాంకర్:
ఇక మరొక ఛానల్లో టీవీ యాంకర్ ప్రశ్నిస్తూ, మీరు కేవలం ప్రతిపక్ష పార్టీలను మాత్రమే టార్గెట్ చేసి సినిమా తీస్తారా అని అడిగారు. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే మీరు ” బాత్రూం లో బాబాయ్” టైటిల్ తో వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సినిమా తీస్తారా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు జగన్ మీద జరిగిన దాడి సమయంలో కోడి కత్తి అంటూ జరిగిన హంగామా సంగతి తెలిసిందే. మరి “కోడి కత్తి” పేరిట ఆ ఎపిసోడ్ మీద కూడా సినిమా తీస్తారా అని సదరు యాంకర్ రాంగోపాల్ వర్మ ని ప్రశ్నించారు.
దీనికి రాంగోపాల్ వర్మ సమాధానం ఇస్తూ, కోడి కత్తి ఎపిసోడ్ లో తగినంత డ్రామా లేదని, దాని మీద గంటసేపు, గంటన్నర సేపు సినిమా తీయడం కుదరదని, అయితే వివేకానంద రెడ్డి హత్య ఉదంతం పై మాత్రం సినిమా తీయడానికి తగినంత డ్రామా ఉందని, దీని మీద సినిమా తీయవచ్చని ప్రకటించారు. అయితే ఇది యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారే తప్పించి నిజంగా రామ్ గోపాల్ వర్మ బాత్రూంలో బాబాయ్ సినిమా తీయలేడని, అధికార వై ఎస్ ఆర్ సి పి కి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడని, ఒకవేళ భవిష్యత్తులో జగన్ అధికారం కోల్పోతే అప్పుడు తీయవచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఏది ఏమైనా కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ, మొట్టమొదటిసారి – పవన్ కళ్యాణ్ ని తాను టార్గెట్ చేసినట్లు నేరుగా ప్రకటించడానికి భయపడడం, వైఎస్సార్సీపీ తెర వెనకాల ఫండింగ్ ఇస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేయడం రామ్ గోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూలో హైలెట్స్ అని చెప్పవచ్చు.