పవన్‌కల్యాణ్‌ని తిడితే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన ఘనుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘ఆఫీసర్’కి అలాగే పబ్లిసిటీ చేయాలని అనుకుంటున్నారా? వర్మ వ్యవహారం చూస్తుంటే ఏదో డౌట్ కొడుతోంది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఆఫీసర్’ సెకండ్ టీజర్ ఇటీవల విడుదలైంది. సుమారు పదహారు లక్షల మంది టీజర్‌ని చూస్తే… అందులో పధ్నాలుగు వేల మంది డిస్లైక్ చేశారు. నిన్న రాత్రికి పదకొండు వేల మంది మాత్రమే డిస్లైక్ చేసినట్టున్నారు. అందుకు బాధ్యులుగా పవన్ అభిమానులను టార్గెట్ చేశారాయన. డిస్లైక్ కొట్టిన వాళ్లంతా పవన్ అభిమానులు అనేది వర్మ ఉద్దేశం.
“సుమారు పదకొండు కోట్లమంది జనాభాలో పవన్ ఫాలోయర్లు పదకొండు వేల మంది మాత్రమే ఉన్నట్లయితే… ‘ప్రజారాజ్యం’ పార్టీ కంటే పెద్ద డిజాస్టర్ కాకుండా జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలని పవన్ అభిమానులుగా నేను, నాగార్జున ‘ఆఫీసర్’ టీమ్ డిమాండ్ చేస్తున్నాం” అని వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎవరో ఒక నెటిజన్ “ఒక్క సెకన్ కూడా నీ ట్రైలర్ చూడకుండా డిస్లైక్ కొట్టా” అని రిప్లై ఇస్తే… “తెలివి లేని ఓ పవన్ అభిమాని ఆఫీసర్ టీజర్ చూడకుండా డిస్లైక్ కొట్టానని చెబుతున్నాడు. అభిమానుల ఐక్యూ లెవల్స్ గురించి జనసేన ఆలోచించాలి” అని పేర్కొన్నారు.
ఇక్కడ బోడిగుండికి, మోకాలికి ముడిపెట్టేస్తున్నారు వర్మ. శ్రీరెడ్డి ఉదంతంలో వర్మ వ్యవహరించిన తీరుపై పవన్ అభిమానులు గుర్రుగా వుంటారని ఎవర్ని అడిగినా చెప్పేస్తారు. అయితే… ‘ఆఫీసర్’ టీజర్‌కి వచ్చిన డిస్‌లైక్‌లు అన్నీ పవన్ అభిమానుల ఖాతాలో వేస్తున్నారు వర్మ. ఆయన మార్క్ పబ్లిసిటీ ఇదే విధంగా వుంటుంది. ఏదో ఒక వివాదం సృష్టించి, అందులోంచి పబ్లిసిటీ పొందాలని చూస్తుంటాడు. కానీ, నాగార్జున వంటి స్టార్ హీరో నటించిన సినిమాకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ సబబు కాదేమో. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే అది కూడా పవన్ అభిమానుల ఖాతాలో వేస్తారా?