ఎన్టీఆర్ బయోపిక్‌ల పోటీ నుంచి వర్మ తప్పుకున్నాడా? `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా రాదా? అవుననే సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించిన వెంటనే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ప్రకటించి, లక్ష్మీ పార్వతి కోణంలోంచి ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తీస్తానని వర్మ చెప్పుకొచ్చాడు. టైటిల్, పోస్టర్ బయటకు వచ్చాయి కూడా. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రలకు సంబంధించిన కాస్టింగ్ కూడా మొదలెట్టాడు. కొంత సమాచారం కూడా సేకరించి పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాని వర్మ పక్కన పెట్టినట్టు సమాచారం. వర్మ సినిమాల్ని ప్రకటించడం, కాస్త అలజడి రేగేలా చేయడం, కొద్ది రోజుల తరవాత.. దాన్ని పక్కన పెట్టేయడం వర్మకి అలవాటే. ఏమైనా అడిగితే `నా ఇష్టం` అంటాడు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై కాస్త బజ్ వచ్చింది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. ఈ సినిమాని వర్మ ఎలాగైనా క్యాష్ చేసుకుంటాడనుకున్నారు. కానీ అనూహ్యంగా వర్మ ఈసినిమానే పక్కన పెట్టేయాలనే నిర్ణయానికి రావడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. మరి… వర్మని వెనక్కి లాగింది ఎవరు? ఈ సినిమాని పక్కన పెట్టడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా? లేదంటే బయోపిక్‌ల వల్ల పెద్దగా ఒరిగేదేం ఉండదని వర్మ భావిస్తున్నాడా? ఏమో మరి.. వర్మ మనసులో ఏముందో?