ప్రముఖులు ప్రజలకు ప్రతి పండుగకూ శుభాకాంక్షలు చెప్పడం కామన్. అయితే వర్మ రూటే సపరేటు కదా. పైగా ప్రతీ పండుగకీ ఓ కాంట్రావర్సీ కామెంట్ పోస్ట్ లేదా ట్వీట్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడేమో కూడా. అప్పట్లో వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని టార్గెట్ చేశాడు. ఇప్పుడు దీపావళి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు గురిపెట్టాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే… వచ్చే ఏడాది దీపావళికి లక్ష్మీ బాంబులు పేలనున్నాయి.
ఆ బాంబ్ పేరు లక్ష్మీ బాంబ్. అంటే ఈ పాటీకే అందరికీ అర్ధమైపోయి ఉండాలి. ఆయన మాట్లాడుతున్నది దేని గురించో… ప్రస్తుతం వర్మ తలకెత్తుకున్న లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ హాట్‌ని, సదరు చికాకు పెట్టే కాంట్రావర్సీని అలాగే ఉంచాలని మరే జీవి అయినా కోరుకోడేమో కాని ఆర్జీవీ మాత్రం తప్పక కోరుకుంటాడు. అందుకే ఈ లక్ష్మీబాంబ్ వార్నింగులిస్తున్నాడని మనకి తేలిగ్గానే అర్ధమవుతుంది.
ఈ ఏడాది దీపావళి ప్రశాంతంగా గడచిపోతోందని, వచ్చే ఏడాది దీపావళికి ఎన్టీయార్ ఆత్మ చాలా చాలా లక్ష్మీ బాంబులు పేల్చబోతోందని ఆయన తన తాజా పోస్ట్‌లో పేర్కోన్నాడు. ఇదంతా ఆయన సినిమా గురించే అని మనకి అర్ధమవుతున్నా… ఇంతకీ ఆయన చెబుతున్న ఆ ఆత్మ ఎవరు అనేదే చిన్న సందేహం… నందమూరి ఆత్మగా ఆయన లక్ష్మీ పార్వతి గురించే మాట్లాడుతున్నారని మనం ప్రస్తుతానికి ఊహించుకోవచ్చు. మరి ఈ పోస్టులో చెప్పిన ప్రకారం అయితే మరో ఏడాది దాకా వర్మ సినిమా విడుదల కాదా? లేదా అది ముందే విడుదలైనా దాని ప్రకంపనలు కోనసాగుతూనే ఉంటాయా?
ఏదేమైనా… మరీ అంత సెల్ఫ్ డబ్బా అవసరమా? పబ్లిసిటీ సంగతేమో గాని… అంత సౌండ్ వస్తుంది, ఇంత సౌండ్ వస్తుంది అని ఆశపడి తెచ్చుకున్న లక్ష్మీ బాంబులే తుస్సు మంటాయి… ఈ విషయం కూడా వర్మ కాస్త గుర్తుంచుకుంటే మంచిదేమో…