లక్ష్మీస్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి పక్కలో బల్లెంలా తయారైంది. ఈ సినిమాతో తమ పార్టీని ఎలా ముంచబోతున్నాడో తెలీక.. బెంగ పెట్టుకుంది టీడీపీ. అది చాలదన్నట్టు… ఇప్పుడు ఏకంగా ఈ సినిమాని నందమూరి బాలకృష్ణకు అంకితం అంటూ ప్రకటించి – ఇంకొంచెం టెన్షన్ క్రియేట్ చేశాడు రాం గోపాల్ వర్మ.
”ఏ సినిమాకైనా స్ఫూర్తి ఓ వ్యక్తే అవుతాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీయాలన్న ఆలోచన కేవలం బాలకృష్ణ వల్లే వచ్చింది. ఆయన్ని కలవకపోతే అసలు ఈ సినిమా తీసేవాడ్నే కాదు. అందుకే ఈ సినిమాని ఆయనకు అంకితం చేస్తున్నా” అంటూ ప్రకటించాడు వర్మ.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం ముందు వర్మని సంప్రదించిన సంగతి తెలిసిందే. కానీ… ఆ ప్రాజెక్టు వర్కవుట్ అవ్వలేదు. ఆ సినిమా తన చేతుల్లోంచి జారిపోయిన తరవాతే వర్మ ఈ సినిమాని ప్రకటించాడు. కేవలం బాలయ్యపై కోపంతోనే వర్మ ఈ సినిమా తీశాడన్నది సినీ జనాలకు బహిరంగ రహస్యమే. దాన్ని ఇప్పుడు తన మాటలతో నిజమే అని నిరూపించాడు వర్మ.
ఈ సినిమా తీస్తానని ప్రకటించినప్పుడు, తీస్తున్నప్పుడు, విడుదలకు సిద్ధం అవుతున్నప్పుడు తనకు చాలా బెదిరింపులు వచ్చాయని, అయితే తాను బెదిరింపులకు భయపడనని, ఏదైనా చేసేవాళ్లు బెదిరించరని, ఒకవేళ ఇంకా ఇంకా బెదిరిస్తే తాను కూడా వాళ్లని బెదిరిస్తానని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు వర్మ.