నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ని సినిమాగా తీయాలనుకోవడం బాక్సాఫీసు దగ్గర షేక్ చేసే ఆలోచనే. కాసుల వర్షం కురిపించగల సత్తా ఉన్న బయోపిక్‌లలో ఎన్టీఆర్‌దీ తప్పకుండా ఉంటుంది. అయితే ఆ సినిమాకి బహుశా రాంగోపాల్ వర్మ దర్శకుడు కావొచ్చన్న విషయమే నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వర్మ ట్రాక్ గురించి తెలియంది కాదు. ఇప్పుడాయన రూపాయి, పావలా సినిమాలు కూడా తీసేస్తున్నాడు. వర్మకీ – బాలయ్యకు ఎలా సెట్ అవుతుందా? అని లాజిక్కులు తీస్తే.. అసలు ఈ ప్రాజెక్టుపై నమ్మకాలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య నుంచి కానీ, ఆయన కాంపౌండ్ నుంచి గానీ ‘ఎన్టీఆర్ బయోపిక్‌కి వర్మనే దర్శకుడు` అని చెప్పింది లేదు. కాకపోతే… వర్మ దర్శకత్వం వహించే అవకాశాలు కొట్టిపడేయలేం.
ప్రముఖ దినపత్రికలకు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూలే ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ప్రశ్నలొచ్చాయి. దర్శకుడు ఎవరు? రాంగోపాల్ వర్మ అయ్యే ఛాన్సులు ఉన్నాయా? అని అడిగితే ”ఇంకా అనుకోలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దర్శకుడ్ని ప్రకటిస్తామ”న్నారు బాలయ్య. సో.. అప్పటి వరకూ వర్మ ఆశల పల్లకిలో ఊరేగొచ్చన్నమాట.