వర్మలో క్రియేటివిటీ తగ్గి, కమర్షియాలిటీ బాగా పెరిగిపోయింది. చీప్ గా ఓ సినిమా చుట్టేసి, వీలైనంత మంచి రేటుకి అమ్ముకుని లాభాలు గడించడం తప్ప, తన స్థాయి గురించి ఆలోచించడం లేదు. అందుకే సర్కార్ లాంటి సినిమా తీసినోడు… మియా మాల్కోవాతో బీ గ్రేడ్ సినిమాలు తీసే రేంజుకి పడిపోయాడు. అయితే వాణిజ్యపరంగా వర్మ ఎప్పుడూ సేఫే. ఎంత ఫ్లాప్ అయినా… కోట్లు కోట్లు పోగొట్టుకోవడాలేం ఉండవు. తన బడ్జెట్‌కి న్యాయం చేసేసుకుంటాడు.
తాజాగా `పవర్‌స్టార్` అనే సినిమా తీస్తున్నాడు వర్మ. పవన్‌పై తీస్తున్న సినిమా కాబట్టి, పవన్‌ని అభిమానించేవాళ్లో, ద్వేసించేవాళ్లలోనో కనీసం 5 శాతం ప్రేక్షకులు తన సినిమా చూస్తే చాలు. డబ్బులు గిట్టుబాటు అయిపోతాయి. అయితే ఆశ మరీ ఎక్కువై ట్రైలర్ చూడ్డానికీ ఓ రేటు ఫిక్స్ చేశాడు. ఆ రేటు పది రూపాయలు ఉంటుందనుకుంటే.. ఏకంగా పాతిక చేసేశాడు. పాతిక రూపాయలు చిన్న మొత్తమే. కాకపోతే రెండు నిమిషాల ట్రైలర్ చూడ్డానికి పాతిక ఎందుకు? సమస్త వినోదమూ ఇప్పుడు సెల్ ఫోన్లలోనే దొరుకుతున్న రోజులు ఇవి. అంతా ఉచితమే. యూ ట్యూబ్‌లోకి వెళ్తే… వందల వేల సినిమాలు ఉచితంగా దొరుకుతాయి. అలాంటి వినోదానికి అలవాటు పడిన ప్రేక్షకుడు వందో, రెండొందలో ఇచ్చి ఏటీటీలో సినిమా చూడడమే గగనం. అలాంటిది ట్రైలర్ చూడ్డానికి పాతిక రూపాయల రేటు పెడితే.. ఎలా? ట్రైలర్ చూపించి, అందులో సరుకు ఉందనిపిస్తే.. తప్పకుండా సినిమా చూడ్డానికి ప్రేక్షకుడు ఆసక్తి చూపిస్తాడు. అప్పుడు టికెట్ రేటు ఎంత పెట్టినా గిట్టుబాటు అవుతుంది. ట్రైలర్‌కే.. రేటు ఫిక్స్ చేస్తే – దాన్నే లైట్ తీసుకుంటారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. రెండు గంటల సినిమానే పైరసీ చేసేస్తున్నారు. ట్రైలర్‌ని కాపీ చేయడం ఎంత సేపు..? ఒకరి తరవాత ఒకరు.. బయటకు వదిలితే – ఇక ట్రైలర్ టికెట్టు కొనేదెవరు?