మహేష్ బాబు హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ‘పోకిరి’ అప్పట్లో ఇండస్ట్రీ హిట్. కలెక్షన్స్ పరంగా అప్పటివరకూ ఉన్న రికార్డులను ఆ సినిమా తిరగరాసింది. అలాంటి సినిమాను పట్టుకుని ప్లాప్ అంటే పూరి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. ఆ మాట వేరేవాళ్లు ఎవరైనా అంటే కోపం వచ్చేదేమో. గురువుగారు రామ్ గోపాల్ వర్మ అనడంతో ఫుల్ హ్యాపీస్. దట్ టూ… కొడుకు ఆకాశ్ పూరి హీరోగా తీస్తున్న ‘మెహబూబా’ను ఆకాశానికి ఎత్తేయడంతో ‘పోకిరి’ని ప్లాప్ అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ‘మెహబూబా’లో కొన్ని సీన్లను గురువు వర్మకి చూపించాడట పూరి. అప్పుడు వర్మగారు “ఇప్పుడే పూరి జగన్నాథ్ ‘మెహబూబా’లో కొన్ని పార్టులు చూసా. కంపేరిజన్ చేస్తే, మహేష్ బాబు ‘పోకిరి’ ప్లాప్ అనిపిస్తుంది. కొడుకు హీరో కావడంతో, తన మీద ఉన్న ప్రేమతో చాలా స్పెషల్ గా తీస్తున్నట్టు ఉన్నాడు. కారణం ఏదైనా ‘మెహబూబా’ ఎపిక్ కింద కనిపిస్తుంది” అని ట్వీట్ వేశారు. దీనికి పూరి “ఫస్ట్ టైమ్ నా బాస్ (వర్మ) నన్నో ఫిల్మ్ మేకర్ గా గుర్తించారు. నా జీవితంలో ఇదే బిగ్గెస్ట్ కాప్లిమెంట్. లవ్ యు సార్” అని రిప్లై ఇచ్చారు. విడుదలకు ముందు తను తీసిన సినిమాలో సీన్లను వర్మకు చూపించడం పూరికి కొత్త కాదు. అప్పుడు వర్మ ఆహా ఓహో అనడమూ కొత్త కాదు. అంతకు ముందు చాలాసార్లు ఇలాంటి తతంగాలు జరిగాయి. సినిమా విడుదలైన తర్వాత వర్మ వ్యాఖ్యల్లో నిజమెంతో తెలుస్తుంది.