‘దారితప్పిన మేధావి’. ఈ మాట దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సరిగ్గా సరిపోతుంది. ఆయన దారితప్పిన మేధావే. తొలి సినిమా ‘శివ’తో తెలుగు సినిమా గతిని మార్చేశాడు. ‘శివ సినిమాకి ముందు శివకి తర్వాత’ అని ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ జెండా పాతాడు. ఒక తెలుగోడు బాలీవుడ్ వెళ్లి అక్కడ అండర్ వరల్డ్ పై సినిమాలు తీస్తుంటే అందరూ థ్రిల్ అయిపోయారు. ఏకంగా వర్మ కంపెనీ అంటూ ఓ సినీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కంపనీ నుండి ఎంతో మంది దర్శకులు, టెక్నిషియన్లు పరిశ్రమకు వచ్చారు. వారంతా మంచి స్థాయిలోనే వున్నారు. అయితే ఒక దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మాత్రం దిగజారిపోయాడు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఇప్పుడు కేవలం శివ పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిగా మిగిలిపోయాడు అనడంతో ఎలాంటి సందేహం, అభ్యంతం లేదు. వర్మ సరైన హిట్ చూసి పుష్కరం దాటిపోయింది. ఆయన క్రియేటివిటి ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైపోయింది. (ఇప్పుడు అదీ లేదు) గొప్ప గొప్ప మాటలు చెప్పడానికే తప్పితే ఓ గొప్ప సినిమా తీద్దాం అనే ద్యాసే లేకుండాపోయింది. ఇప్పుడే వస్తున్న కుర్రాలు అద్భుతమైన టెక్నిక్ తో ఆకట్టుకుంటున్న ఈ రోజుల్లో వరల్డ్ సినిమాని మంచి నీళ్ళలా తాగేసిన వర్మ పైత్యపు సినిమాలు తీస్తున్నాడు.
ఇప్పుడు వర్మ ఇంకా కిందకు పడిపోతున్నాడు. బహుశా దీన్ని బద్ధకం అనాలి. ఓపిక నశించి.. ఇప్పుడు వెబ్ సిరీస్ లకు పరిమితమైపోవడానికి రెడీ అయ్యాడు వర్మ. వెండితెరపై సినిమాను చూపించే ఓపిక నశించి ఇప్పుడు రివర్స్ గేర్ లో షార్ట్ ఫిల్మ్ లు తీసుకుంటున్నాడు. దీనికి ఆయన పెట్టుకున్న పేరు ”ఫ్రీడం అఫ్ పిక్చరైజేషన్”. అంటే తనకు నచ్చింది చూపిస్తాడన్నమాట. దీనికి లాజిక్ వుండదు. బద్ధకంతో కూడిన పైత్యం అంతే. దానికి అందంగా ఆ పేరు పెట్టుకున్నాడు.
తాజాగా ఆయన నుండి వచ్చిన షార్ట్ ఫిల్మ్ ”మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తి హై’ (“నా కూతురు సన్నీలియోన్ అవ్వాలనుకుంటోంది). ఈ షార్ట్ ఫిల్మ్ లో వర్మ కొత్తగా ఏమీ చెప్పలేదు. చూపించాడు. ‘రాముయిజం’ అంటూ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు వర్మ. ఈ షార్ట్ ఫిల్మ్ లో వున్న పైత్యం అంతా ఆ ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిందే. ఓ అమ్మాయి సంపద, పవర్ ఆమె సౌందర్యమే. దాన్ని విచ్చలవిడిగా వాడుకోవడమే” అంటూ ఏవో దిక్కుమాలిన థీసిస్ చెప్తుంటాడు వర్మ. ఆ దిక్కుమాలని మాటలనే కెమరా, నటులు దొరికారని షార్ట్ ఫిల్మ్ గా తీసేశాడు. ”మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తి హై’.. టైటిల్ లోనే అంతా వుంది. ఓ అమ్మాయి సన్నీ లీయోన్ అవుతానని తల్లితండ్రులతో చెబుతుంది. వద్దంటారు. వినదు. వర్మ చెప్పిన దిక్కుమాలని లాజిక్కులన్నీ చెబుతుంది. చివరి ఆ తల్లి తండ్రులకు ఏం అనాలో అర్ధం కాదు. ఇదే ఆ షార్ట్ ఫిల్మ్.
ఈ దేశంలో తమకు నచ్చినట్లు జీవించే హక్కు ప్రజాస్వామ్యం ప్రసాదించింది. ఎవరి ఛాయిస్ వాళ్ళది. వర్మ యాంగిల్ వర్మది. అయితే సన్నీ లీయోన్ కావడం ఏమిటో అర్ధం కాదు. ఈ దేశంలో ఎక్కడైనా ఒక అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకుంటుందా? ఎక్కడైనా వుందా ఇది. ఇదేం థాట్ ప్రాసస్.?! ఏం చెబుతున్నాడు వర్మ.? వర్మ చూపించిన షార్ట్ ఫిల్మ్ గురించే మాట్లాడుదాం. మంచి ఇల్లు. ప్రేమగా చూసుకునే తల్లితండ్రులు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సమాజంలో పద్దతిగా బ్రతుకుతున్న ఓ కుటుంబం. ఆలాంటి కుటుంబంలో వున్న ఓ అమ్మాయి సడన్ గా ”నేను సన్నీలియోన్ లా కావాలనుకుంటున్నాను ”? అని చెబుతుందా? సన్నీ లీయోన్ పెరిగిన దేశం, అక్కడి కట్టుబాట్లు ,ఆమె అనుభవించిన పరిస్థితులు ఆమెను పోర్న్ స్టార్ గా మార్చాయి. ఆ జీవితం వద్దకుని, దాన్ని ఒక పీడకల లా మర్చిపోయి తిరిగి కొత్త జీవితం ప్రారభించింది సన్నీ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పదలచుకున్నాడు? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు? ఆ షార్ట్ ఫిల్మ్ లో మాట్లాడిన అమ్మాయి మైండ్ సెట్ ఏమిటి ? తన భావదారిద్ర్యాన్ని ఒక అమ్మాయిపై రుద్దిన వర్మ …రానున్న కాలంలో ఇంకెంత దిగజారిపోతాడో..