సినిమా వాళ్ళంతే. మిగతా అన్ని రోజులూ ఎలా ఉన్నా సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండేసరికి ప్రేక్షకులతో సహా అందరికీ సోప్ వేస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో అసహనం అని చెప్పి చిత్తానికి మాట్లాడేసిన అమీర్ ఖాన్ అంతటివాడు కూడా ఇప్పుడు మోడీ అండ్ కోని మెప్పించే పనిలో పడిపోయాడు. ఇక తెలుగు నేర్చుకుని మరీ తెలుగులో యాక్ట్ చేస్తా, పవన్, చిరంజీవిలతో కలిసి నటిస్తా లాంటి కామెడీ డైలాగులు అయితే కోకొల్లలుగా మాట్లాడేశాడు. ఇక దేశంలో ఉన్న మిగతా సినిమావాళ్ళందరిదీ ఒక స్టైల్…నాది సెపరేట్ స్టైల్ అని చెప్పుకునే వర్మ కూడా ‘వంగవీటి’ కోసం మరీ రోటీన్ అయిపోయాడు. కమెడియన్ సప్తగిరి చేస్తున్న పవన్ భజన కంటే ఇప్పుడు వర్మ చేస్తున్న పవన్ భజనే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంది.
పవన్ కళ్యాణ్‌లో ఒక అగ్నిపర్వతం దాగి ఉందట, అది టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుందట…ఇవీ రామ్ గోపాల్ వర్మ పలుకులు. పవన్‌ని ఆకాశానికి ఎత్తాలి. ఎట్ ద సేం టైం అవి సెటైర్స్లా కూడా ఉండాలి. వారం రోజుల్లో వంగవీటి సినిమా పని అయిపోయిన వెంటనే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేయాలి కదా…అదన్నమాట అసలు స్ట్రాటజీ. హమ్మ…వర్మా….నా సినిమాలు చూడమని అడిగానా? నచ్చితే చూడండి, లేకపోతే లేదు లాంటి హీరోయిక్ డైలాగులు ఎన్నో పేల్చిన నువ్వేనా ఇప్పుడు వంగవీటి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం తాపత్రయపడుతోంది. ‘శివ టు వంగవీటి’ ప్రోగ్రాం ఎందుకు ఆర్గనైజ్ చేశారు వర్మాజీ. నేను శివ సినిమా తీసిన డైరెక్టర్ని. మధ్యలో వచ్చిన ఐస్‌క్రీమ్‌లు మర్చిపోండి… ఇప్పుడు వంగవీటి సినిమాను తీశాను. థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి అని ప్రేక్షకులకు చెప్పడానికేగా. ఇక ఈవెంట్‌కి వచ్చిన నటులు, దర్శకులు అందరూ కూడా అద్భుతః అనే రేంజ్లో నటించేశారు. తెలుగు స్టార్ హీరోల ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కంటే నీ ‘శివ టు వంగవీటి’ ఈవెంట్లో పెట్టిన భజన ప్రోగ్రాం మరీ సిల్లీగా ఉంది. ఇక ఇప్పుడు ఇన్నాళ్ళూ నువ్వు కెలికేసిన పవన్ అభిమానులను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డావా? అది కూడా పొగడ్తో, తెగడ్తో తెలియకుండా పవన్ అభిమానులను ఎర్రోళ్ళను చేసే ప్రయత్నం కూడానా? నువ్వేమో పవన్ భజన మొదలెడితే నీ టీం వాళ్ళేమో సినిమాలో ఎన్టీఆర్ సీన్ అదుర్స్, బెదుర్స్ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారుగా. తీరా చూస్తే సినిమాలో ఏం ఉంటుంది? రక్తచరిత్ర సినిమాలో ఎన్టీఆర్‌ని కానీ, వైఎస్‌ని కానీ చూపించే ధైర్యం చేశావా? ఫ్యాక్షనిస్టుల్లో ఒక వర్గాన్ని ఎన్టీఆర్ ఎకంరేజ్ చేశాడన్న విషయాన్ని చెప్పడానికి ఎంత డ్రమెటిక్ సీన్ అవసరమైంది నీకు. ఇఫ్పుడిక వంగవీటి సినిమాలో మాత్రం అంతకంటే ఎక్కువ ధైర్యం చేయగలవా? వంగవీటి సినిమాను అన్ని వర్గాలూ చూసేలా చేయాలన్న ప్రయత్నంలో ఎన్టీఆర్‌ని కెలకడం తప్పితే కనీసం రెండు మూడు సీన్స్‌లో అయినా ఎన్టీఆర్ కనిపిస్తాడా? వంగవీటి కథలో ఎన్టీఆర్ పాత్రను నిజాయితీగా తెరకెక్కించే ధైర్యం నీకు ఉందా?
కలెక్షన్స్ కోసమే నీ ప్రయత్నాలు అన్న విషయం అర్థమవుతూనే ఉంది వర్మా. బాక్స్ ఆఫీస్ దగ్గర గెలవడమే టార్గెట్ అయినప్పడు మాఫీయా సినిమాలు, బి గ్రేడ్ సినిమాలు తీసుకోక మధ్యలో ఇలా రాయలసీమ ఫ్యాక్షనిజం అని, బెజవాడలో కులాల మధ్య గొడవలు అని చెప్పి మర్చిపోవాలనుకుంటున్న రాచపుండును మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు అవసరమా? అయినా అదంతా గడిపోయిన చరిత్ర. ఇప్పుడంతా రాజకీయమే. కులం, మతం, ప్రాంతం, పార్టీ….అన్నింటితోనూ బిజినెస్ చేస్తున్నారు. నీ ‘వంగవీటి’ సినిమాకు కూడా వ్యాపారాన్ని మించిన ప్రయోజం ఏదైనా ఉందా వర్మా?