రామ్ గోపాల్ వర్మ దేవుళ్ళని కూడా వదిలిపెట్టడు. మరి అటువంటప్పుడు సినిమా హీరోలని, హీరోయిన్లని వదిలిపెదతాడనుకోవడం పొరపాటు. అందుకే చిన్నాపెద్దా లేకుండా అందరిపై నోటికి వచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుంటాడు. ‘అడుసు త్రొక్కనేల కాలు కడుగునేల’ అన్నట్లుగా వర్మ వంటి వ్యక్తితో వాదోపవాదాలకి దిగితే తమ పరువేపోతుందని అందరూ ఆయన విమర్శలని, కామెంట్లని పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ పై కూడా రామ్ గోపాల్ వర్మ చాలా కామెంట్లే చేస్తుంటాడు కానీ ఆయన కూడా వాటిని ఎన్నడూ పట్టించుకొనేవారు కాదు. కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ కొంచెం ఘాటుగా సమాధానం చెప్పారు.
తన గురించి పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు రామ్ గోపాల్ వర్మ చూసినట్లు లేదు. అందుకే అలవాటు ప్రకారం మళ్ళీ పవన్ కళ్యాణ్ పై మరో రౌండ్ విమర్శలు చేసారు. ఈసారి ఏమన్నారంటే, “మెగా పవర్ సర్దార్ గబ్బర్ సింగ్ మరియు రాజా సర్దార్ గబ్బర్ సింగ్ లను చంపేసిన ఈ చిన్నారి పిల్లాడిని చూడండి” అంటూ జంగిల్ బుక్ సినిమాలో నటించిన బాలనటుడి ఫోటో తన ట్వీటర్ లో పెట్టారు. ఆ తరువాత ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమా అన్నిచోట్ల విజయవంతంగా ఆడగలుగుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సినిమా ఆడలేకపోతే, ఆయనని నిద్రలేపవలసిన భాద్యత అభిమానులదే,” అని మరో మెసేజ్ పెట్టారు.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తెలుగులోనే ప్రజలను ఆకట్టుకోలేకపోయిందని స్పష్టమయింది. అటువంటప్పుడు అది హిందీలో సూపర్ హిట్ అయిపోతుందని ఎవరూ అనుకోరు. కానీ రామ్ గోపాల్ వర్మ అదేదో ఘోర తప్పిదం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి రామ్ గోపాల్ వర్మ వంద సినిమాలు తీస్తే అందులో ఒక్కటి హిట్ అవడం కూడా చాలా కష్టమని అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఈవిధంగా అవాకులు చవాకులు ఎందుకు వాగుతున్నారు.
అందుకే “రామ్ గోపాల్ వర్మ ఇతరులపై చూపే ఆసక్తి, శ్రద్ధని తన సినిమాలపై చూపి ఉండి ఉంటే నేడు వేరే స్థాయిలో ఉండేవారు..ఆయనలాగే నేనూ విమర్శించగలను కానీ నా తోటి ఫిలిం మేకర్ అనే ఉద్దేశ్యంతోనే మౌనం వహిస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ జవాబిచ్చారు.
ఒకప్పుడు ‘శివ’ సినిమా విడుదలయినప్పుడు తెలుగు సినీ పరిశ్రమకి మరొక అద్భుతమయిన దర్శకుడు దొరికాడు. అతను తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తాడు,” అని అందరూ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఆయన తీసిన కొన్ని తెలుగు, హిందీ చిత్రాలు ఆయనపై అటువంటి అభిప్రాయాన్నే కలిగించాయి. కానీ పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్లుగా వర్మలో ఆ స్పార్క్ తగ్గిపోయి దాని స్థానంలో ‘టెంపర్’ పెరిగింది. ‘నేను తీసిందే సినిమా…నచ్చితే చూడండి నచ్చకపోతే మీ ఖర్మ’ అనే స్థాయికి ఎదిగారు. అదే సూత్రం పవన్ కళ్యాణ్ కూడా చెపితే దానికి వర్మ సమాధానం ఏమిటో? గత కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ తను తీసే సినిమాల వలన కాకుండా తన నోటి దురుసుతనం, ఇటువంటి విమర్శలు, వ్యాఖ్యలతోనే నెట్టుకు వస్తున్నారు. లేకుంటే ఆయన సినీ పరిశ్రమ నుంచి ఎప్పుడో కనుమరుగయిపోయుండేవాడు. ఇప్పటికయినా రామ్ గోపాల్ వర్మ తన దృష్టిని ఇతరులపై కాకుండా తన సినిమాలపై పెడితే బాగుంటుంది లేకుంటే తన నోటి దురుసుతనానికి ఏదో ఒకరోజు చాలా అవమానకరమయిన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చును.