మూడో వేవ్‌లో ఇంటికొకరు చనిపోతారంటూ పర్చూరి మల్లిక్ అనే కెమికల్ ఇంజినీర్ ఓ టీవీ చానల్లో చర్చలో కూర్చుని బల్లగుద్ది చెప్పడం.. సోషల్ మీడియాలో హైలెట్ అయింది. పోకిరి సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని సెటైరిక్‌గా చెప్పినట్లుగా.. ఇప్పుడు కెమికల్ ఇంజినీర్ అని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. పర్చూరి మల్లిక్ అనబడే ఆ కెమికల్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయంటే.. చివరికి తెలంగాణ సర్కార్ కూడా స్పందించింది. ఆయన ప్రజల్ని భయపెడుతున్నారంటూ కేసులు పెట్టేసింది. దీనిపైనా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వివాదంలోకి కొత్తగా రామ్ గోపాల్ వర్మ కూడా జోక్యం చేసేసుకున్నారు.
ఊరందరిది ఓ దారి.. ఉలిపి కట్టెది ఓ దారి అన్నట్లుగా … ఆర్జీవీ కెమికల్ ఇంజినీర్కే సపోర్ట్ చేస్తూ రంగంలోకి దిగారు. ఆయనపై కేసు పెట్టడాన్ని ఖండిస్తూ.. తెలంగాణ డైరక్టరేట్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ.. ఏకంగా పదహారు ట్వీట్లు చేశారు. థర్డ్ వేవ్ గురించి మల్లిక్ మాట్లాడిన అంశాలపై ఎలా కేసులు పెడతారంటూ వర్మ మండిపడ్డారు. తనపైనా ఎఫ్ఐఆర్ సిద్ధం చేయడానికి రెడీగా ఉంటారేమో.. అని సెటైర్లు వేశారు. ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎక్కడ వివాదం ఉంటే.. అక్కడ రామ్‌గోపాల్ వర్మ ఉంటారన్నట్లుగా … ఇప్పుడు ఈ వివాదంలో నేరుగా ప్రభుత్వ అధికారిని ఆర్జీవీ టార్గెట్ చేయడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం పర్చూరి మల్లిక్ అనబడే కెమికల్ ఇంజినీర్‌పై కేసులు పెట్టడం.. తప్పా.. ఒప్పా అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అందులో ఆర్జీవీ వచ్చి.. మరింత మసాలా దట్టిస్తున్నారు.