రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరని ఒక సామెత. సినిమా ప్రముఖులకు, మీడియా చానళ్ల మధ్య కూడా అంతే. శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదు. ఒక్కోసారి ఛానల్స్ సినిమా ప్రముఖులను ఆకాశానికి ఎత్తేస్తాయి. తర్వాత అదే ఛానల్స్ సదరు ప్రముఖులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నిస్తాయి. కానీ, సినిమా ప్రముఖులు మాత్రం సంయమనంతో వ్యవహరిస్తారు. మీడియాను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వర్మ మాత్రం మీడియాకు ఎదురు వెళ్తున్నారు. ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9పై కేసు పెట్టనున్నట్లు ట్వీట్ చేశారు. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ కేసు విషయంలో టీవీ9 అవాస్తవాలు ప్రసారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పనిలో పనిగా టీవీ9లో డిబేట్స్ కండక్ట్ చేసే రజనీకాంత్ మీదా పంచులు వేశారు వర్మ. ఏదైనా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అందులో న్యూస్ లీక్ చేయడం క్రైమ్ కిందకు వస్తుందని వర్మ స్పష్టం చేశారు. చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని టీవీ9కి సూచించారు.
‘జీఎస్టీ’ గురించి వర్మ ప్రకటించిన తర్వాత ముందు అతన్ని స్టూడియోకి పిలిచి డిస్కషన్ పెట్టింది. ఐద్వా నేత మణిపై వాళ్ళ ఛానల్లో వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయగా… రెండో రోజు మహిళా నేతలను స్టూడియోకి తీసుకొచ్చి వర్మకు వ్యతిరేకంగా ఒక కార్యక్రమం ప్రసారం చేసింది. వర్మపై సామాజిక కార్యకర్త దేవి కేసు నిమిత్తం విచారణకు హాజరైన అనంతరం వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో టీవీ9పై చాలా కేసులు పెడుతున్నట్టు ట్వీట్ చేశారు.