వర్మ తెలివితేటలు ఓ రేంజులో ఉంటాయి. దర్శకుడిగా ఎంత స్ట్రాంగో, నిర్మాతగా అంతకంటే స్ట్రాంగు. తన సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో తనకు తెలుసు. ఖర్చు పెట్టింది ఎలా రాబట్టుకోవాలో ఇంకా బాగా తెలుసు. లక్షల్లో సినిమా తీసి, కోట్లకు పరిపడా పబ్లిసిటీ తెచ్చుకొని లాభాలు ఆర్జించుకోవడంలో దిట్ట. వర్మ సినిమాల్లో తక్కువ బడ్జెట్తో పూర్తయిపోతాయి. అయితే ఈసారి వర్మ బడ్జెట్ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నాడట. తన కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమా ఒకటి తీస్తున్నాడు అదే.. రాయ్.
బెంగుళూర్ కి చెందిన ‘ముత్తప్ప రాయ్’ అనే గ్యాంగ్ స్టర్ కథలో సినిమాటిక్ మార్పులు చేసి… రాయ్ గా తీస్తున్నాడు వర్మ.
వివేక్ ఒబెరాయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ బడ్జెట్ రూ.50 కోట్లు దాటేసిందట. కన్నడ, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేసే సౌలభ్యం ఉండడంతో ఇంత భారీగా ఖర్చు పెట్టించాడట. దాదాపు 50 శాతం షూటింగ్ లండన్లో జరిపారట. అందుకే.. భారీ బడ్జెట్ అయ్యిందంటున్నారు. వర్మ మాటలు ఎప్పుడూ నమ్మబుద్ది కాదు. పావలా అయితే పాతిక రూపాయలంత బిల్డప్ ఇస్తాడు. ఈ సినిమా వ్యవహారం కూడా అంతే అయ్యింటుందని టాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 కోట్లు పెట్టి సినిమా తీసేంత గట్స్ వర్మకు లేవని, వర్మని నమ్మి అన్ని డబ్బులు పెట్టే ధైర్యం కూడా నిర్మాతలకు లేదని, రూ.50 కోట్ల మాట అంతా గ్యాస్ అని చెబుతున్నారు. మరి నిజానిజాలేంటన్నది సినిమా విడుదలైతే అర్థమైపోతుంది.