పవర్ స్టార్ అన్న పేరుతో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా కి పబ్లిసిటీ తీసుకురావడం కోసం రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఇటీవల ” ప్రపంచంలోనే మొదటి పెయిడ్ ట్రైలర్” అంటూ హంగామా చేశారు. ఆ హంగామా లో భాగంగా అసలు రాజమౌళి కూడా తనలాగా కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలని, ట్రైలర్ ను సైతం జనాలు డబ్బులు ఖర్చు చేసి చూసే లాగా ట్రైలర్ విడుదల చేయాలని ప్రగల్బాలు పలికారు. ఇంతా చేసి తీరా ఇప్పుడు అదే ట్రైలర్ ని ఫ్రీగా యూట్యూబ్ లో విడుదల చేసి తుస్సుమనిపించారు రామ్ గోపాల్ వర్మ. వివరాల్లోకి వెళితే..
రాజమౌళికి సుద్దులు చెప్పే స్థాయి ప్రస్తుత రామ్ గోపాల్ వర్మ కి ఉందా అంటూ విమర్శలు:
రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్ దాకా రావడం చాలా సంవత్సరాల కిందట మానేశారు. ఐస్‌క్రీమ్, ఆఫీసర్ లాంటి చిత్రాలకు సున్నా రేటింగ్ ఇవ్వలేక పోతున్నందుకు చింతిస్తూ 1/5 వంటి రేటింగులు ఇస్తున్నా మంటూ అప్పట్లో సమీక్షకులు సెటైర్లు విసిరారు. దర్శకత్వం చేయడం చాలా సంవత్సరాల క్రితం మరిచిపోయిన వర్మ ఏదో ఒక రకమైన కాంట్రవర్సీ సృష్టించి ఒకటి రెండుసార్లు జనాలను థియేటర్ల దాకా రప్పించారు కానీ, ఒకటి రెండు సార్లు మోసపోయిన ప్రేక్షకులు ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. అయితే కరోనా నేపథ్యంలో మిగతా థియేటర్లు కూడా మూతపడి పోవడం వల్ల, జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లను, సోషల్ మీడియా ని ఎంటర్టైన్మెంట్ కోసం ఆశ్రయిస్తుండటం తో దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో గత రెండు నెలల్లో సీరియల్ కు ఎక్కువ షార్ట్ ఫిలిం కు తక్కువ స్థాయి సినిమాలను ( నిజానికి వీటిని సినిమాలు అని కూడా అనలేం, నగ్నం అన్న సినిమా నిడివి కేవలం ఇరవై నిమిషాలు, వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ తో ఇది సమానం) తీస్తూ వాటిని పే పర్ వ్యూ పద్ధతిలో అమ్ముకుంటూ కాలం గడిపేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.
పైగా ఇందులో కంటెంట్ కూడా మరీ నాసిరకంగా ఉంటుంది. పోర్న్ కంటెంట్ తోనో, లేదంటే బి గ్రేడ్ థ్రిల్లర్ సినిమాల కంటే నాసిరకమైన స్థాయిలో ఉన్న కంటెంట్ తోనో సినిమాలు ఉంటున్నాయి. అయినప్పటికీ “మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్న” కొన్ని టీవీ చానల్స్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ బూతు సినిమాలకు పబ్లిసిటీ ఇస్తూ ఉండడంతో రామ్ గోపాల్ వర్మ కూడా తానేదో గొప్ప సినిమాలు తీస్తున్నట్లు, గొప్ప ట్రెండ్ సృష్టిస్తున్న ట్లుగా ఫీల్ అవుతూ ఉండడంతో – భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి వంటి వారికి సైతం నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది పూర్తి హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా 10 లక్షల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలకు ( నగ్నం సినిమా హీరోయిన్ తో రెండు రోజుల పాటు పని చేయించుకుని రోజుకు లక్ష చొప్పున రెండు లక్షలు ఇచ్చారని ఆవిడే చెప్పుకుంది. ) అయిదారు లక్షల లాభం వస్తుండడంతో, వారానికో సినిమా వదులుతూ రామ్ గోపాల్ వర్మ టైమ్ పాస్ చేస్తున్నారు. అలా చేస్తూ వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు తీస్తున్న రాజమౌళికి ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ నెటిజనులు విమర్శిస్తున్నారు.
ట్రైలర్ లీక్ డ్రామా:
తనలాగా ట్రైలర్లను కూడా క్యాష్ చేసుకునే స్థాయికి రాజమౌళి రావాలని నీతులు చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు ట్రైలర్‌ను ఫ్రీగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎవరో స్టాఫ్ తన ట్రైలర్ ను పైరసీ చేయడం వల్ల తమకు వేరే గత్యంతరం లేక దీనిని ఫ్రీ గా విడుదల చేస్తున్నామని, ట్రైలర్ కోసం డబ్బులు కట్టిన వారందరికీ వారి డబ్బులు వాపసు ఇస్తామని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అయితే ట్రైలర్ లీక్ అన్నది పూర్తిగా రాంగోపాల్ వర్మ స్టైల్ జిమ్మిక్కు అని, డబ్బులు పెట్టి టైలర్ చూడడానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య కొన్ని వందల కు కూడా మించక పోవడంతో, జనాలు డబ్బులు పెట్టి ట్రైలర్ చూడరు అన్న విషయం అర్థం కావడంతో, ఇప్పటికిప్పుడు ట్రైలర్ ఫ్రీ అనడానికి ముఖం చెల్లక రాంగోపాల్ వర్మ ఈ పైరసీ డ్రామాకు తెరలేపారని నెటిజన్లు అంటున్నారు. నిజంగా తన స్టాఫ్ పైరసీ చేసి ఉంటే రాంగోపాల్ వర్మ పోలీస్ కంప్లైంట్ పేరుతో మరిన్ని జిమ్మిక్కు లకు తెరలేపి ఉండేవారని వారు అంటున్నారు.
మొత్తం మీద చూస్తే, ట్రైలర్‌కు కూడా డబ్బులు వసూలు చేసే విధంగా రాజమౌళి తన లా కొత్తగా ఆలోచించాలి అని బీరాలు పలికిన రామ్ గోపాల్ వర్మ, చివరకు ట్రైలర్ ను యూట్యూబ్ లో ఫ్రీగా విడుదల చేసి అభాసు పాలైనట్లు గా కనిపిస్తోంది.