ఎవరిని కెలక్కూడదో వాళ్లనే కెలికేశాడు నాగబాబు. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూసుకొంటూ, ట్వీట్టర్ ఖాతాని పనిపెట్టాలని చూసే రాంగోపాల్ వర్మ ఊరుకొంటాడా..? ట్వీట్ల దండయాత్ర మొదలెట్టేశాడు. ‘నాగబాబు సారూ…’ అంటూ మర్యాద ఇస్తూనే తాను చెప్పదలచుకొన్నది నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. ఒకటా రెండా.. ట్వీట్లే ట్వీట్లు. ‘అసలు నీ వల్లే ఆంధ్రాలో చిరు పరువు పోయింది. ప్రజారాజ్యం పార్టీ విషయంలో నీ సలాహాలు విని చిరు నష్టపోయాడు..’ అన్నంత వరకూ వెళ్లింది వ్యవహారం. అంతేనా.. ? ‘నా మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. నువ్వేవో నీ అన్నదమ్ముల మీద ఆధారపడి బతుకుతున్నావు’ అంటూ పర్సనల్ విషయాల్లోనూ జోక్యం చేసుకొనేంత వరకూ వెళ్లింది పరిస్థితి. నాలాంటి అక్కుపక్షల్ని తిట్టడంలో పెట్టేశ్రద్ద.. అన్నయ్యని పొగడడంలో పెట్టమని చతుర్లు వేశాడు. నాగబాబు గారూ… మీకు ఇంగ్లీషు రాదు కాబట్టి, నా ట్వీట్లను ఎవరిచేతైనా ట్రాన్స్లేట్ చేయించుకోండి.. అంటూ నాగబాబు అజ్ఞానాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు వర్మ.
అంతేనా.. చిరుకీ కొన్ని సలహాలివ్వడం మొదలెట్టాడు. ఇలాంటి ఫంక్షన్లకు నాగబాబు లాంటి వాళ్లని దూరం పెట్టమని, వాళ్ల వల్ల ఫంక్షన్ పాడవుతుందని ఓ అభిమానిగా సలహా ఇచ్చాడు వర్మ. ఇమేజ్ ని డామేజ్ చేసేవాళ్లు చిరు చుట్టుపక్కలే ఉన్నారని, అలాంటి వాళ్లకు దూరంగా ఉండమని ట్వీట్టాడు. ఇలా ఒకటా రెండా అటు చిరంజీవిని, ఇటు నాగబాబునీ ఉటంకిస్తూ ఎన్ని ట్వీట్లో. మొత్తానికి వర్మకి వంగవీటి తరవాత కాలక్షేపానికి నాగబాబు భలే దొరికాడు. ‘వీడ్ని అనవసరంగా కెలికాను..’ అంటూ నాగబాబే అనుకొనేలా. ఈ తుఫాను ఎప్పటికి ఆగుతుందో…?!