వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మని పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించిన తరువాత “ఇకపై పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టను. బైబై పవన్ కళ్యాణ్ అభిమానులు,” అని ఒక మెసేజ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా తన సూచనలను, అభిప్రాయాలను ఆయన అభిమానులు తప్పుగా అర్ధం చేసుకొంటున్నందుకే ఇకపై పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేయనని హామీ ఇచ్చారు. ఆయన ఈ మాట చెప్పి గట్టిగా రెండు వారాలు కూడా కాలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వెంటపడటం మొదలుపెట్టారు. ఆయన నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఈరోజు విమర్శలు గుప్పించారు. “హిందీలో విడుదల చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తెలుగు సినీ పరిశ్రమపై బాలీవుడ్ నమ్మకాన్ని పోగొట్టింది. రాజమౌళి తీస్తున్న బాహుబలి-2 ఆ నమ్మకాన్ని మళ్ళీ మూడింతలు పెంచుతుంది,” అని ట్వీట్ చేసారు.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా బాధపడుతున్న పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులకి రాం గోపాల్ వర్మ చేస్తున్న ఈ విమర్శలు, ఎత్తిపొడుపులు పుండు మీద కారం చల్లుతున్నట్లుంది. “నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని” అని అంటూనే రాం గోపాల్ వర్మ ఈవిధంగా పవన్ కళ్యాణ్ ని వేధించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆయన దర్శకత్వంలో సినిమా చేయనందుకే, ఆయన వారిని ఈవిధంగా వేదిస్తున్నాడేమోనని మెగాభిమానులు అనుమానిస్తున్నారు. రాం గోపాల్ వర్మ సినీ పరిశ్రమలో ఒక దర్శకుడిగా ఉంటూ సాటి దర్శకుల గురించి, వారి సినిమాల గురించి చులకనగా మాట్లాడుతుంటారు. కానీ ఎవరయినా తన ఫ్లాప్ సినిమాల గురించి ప్రశ్నిస్తే తెగ ఆవేశపడిపోతుంటారు. “నా సినిమాలు నాయిష్టం..నచ్చితే చూడండి లేకుంటే మానేయండి,” అని చెపుతుంటారు. మరి అదే బాధ, అదే నియమం ఇతరులకి కూడా ఉంటుందని గ్రహించకపోవడం ఏమిటో ? పవన్ కళ్యాణ్ కి ఈ రాంగోపాల్ వర్మ గోల ఇంకా ఎప్పుడు వదులుతుందో తెలియదు కానీ ఆయన ఇటువంటి విమర్శలతో పవన్ కళ్యాణ్ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పవచ్చు.