చదివేస్తే ఉన్నమతి పోయినట్టు..
నానాటికీ తీసికట్టు నాగం బొట్టు
చదవక ముందు కాకరకాయ్.. చదివాక కీకరకాయ్..
ఇలాంటి సామెతలు అచ్చంగా మన రాంగోపాల్ వర్మలాంటి వాళ్లకోసమే పుట్టుంటాయి.
వర్మ గొప్ప దర్శకుడు అని చెప్పడానికి ‘శివ’లాంటి ఉదాహరణ ఒక్కటి చాలు. వర్మ పని అయిపోయిందని చెప్పడానికి ‘ఐస్ క్రీమ్’ లాంటి సినిమా కూడా అంతే పక్కాగా సరిపోతుంటుంది. ఆ మాటకొస్తే వర్మ ఖేల్ ఖతం అని చెప్పడానికే ఎక్కువ ఉదాహరణలు కనిపిస్తుంటాయి. వర్మ మేధస్సు స్టడీకామ్లకూ, ఫ్లో సౌండ్లకూ, కంటికి కనీకనిపించని కెమెరాలకు, ట్విట్టర్ లో సెటైర్లకూ అంకితమైపోయిందేమో అనిపిస్తుంటుంది. వర్మ గొప్ప మేధావి. మాటల్లో అతన్ని గెలవలేం. కాసేపు మాట్లాడే ఛాన్సిస్తే సచిన్ టెండూలర్క్ది పాకిస్థాన్, సల్మాన్ ఖాన్ హీరో కాదు, ఫుడ్ బాల్ ప్లేయర్ అని చెప్పి, మనచేత ‘అవును కదా’ అనిపిస్తాడు. అందుకే నిర్మాతలు కూడా ఏటీఎమ్ సెంటర్ల దగ్గర సగటు పౌరుల్లా… వర్మ ముందు క్యూ కడుతుంటారు. వర్మ టెక్నిక్కూ.. అతని మేధస్సు ఉపయోగిస్తే రోజుకో సినిమా తీసి పారేయగలడు. కానీ మనమీద దయ ఉంచి నెలకొకటో… రెండు నెలలకొకటో వదులుతున్నాడంతే. వర్మ సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా, తన సినిమా చూసి ఎన్నిసార్లు నీరసంతో ఇంటికొచ్చినా.. ఇక వర్మ సినిమా తీసినా వెళ్లకూడదు గాక వెళ్లకూడదని ఒట్టు పెట్టుకొన్నా.. వర్మ నుంచి మరో సినిమా వస్తోందంటే ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తుంటాం. అచ్చం వర్మలానే.
ఇప్పుడు వంగవీటి అంటూ ఓ ఆణిముత్యం తీశాడు. నిజానికి ఈ సినిమా గురించి ఎవ్వరూ పట్టించుకొనే వారు కాదు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు వర్మ ఓవరాక్షన్ చేయకపోతే. ‘చాలా కాలం తరవాత ఇంత గొప్ప కథ దొరికింది..’ అంటూ మురిసిపోయాడు వర్మ. ‘ఇక ఇలాంటి గొప్ప కథ నాకు తెలుగులో దొరకదు గాక దొరకదు. అందుకే.. తెలుగులో ఇక నేను సినిమాలు తీయను’ అంటూ ఇచ్చిన రకరకాల బిల్డప్పులు చూసి నిజంగానే వర్మ అంత గొప్ప సినిమా తీశాడేమో అంటూ ఆశ పడ్డారు. వంగవీటి తరవాత చాలా మారిపోయా.. ఆ మార్పు ఎలా ఉండబోతోందో రాబోయే రిజల్ట్స్ చెబుతాయి అంటూ భీకరంగామాట్లాడేశాడు వర్మ. ఈ సినిమాకు ఇచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. శివ టూ వంగవీటి అంటూ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఓ కార్యక్రమం నిర్వహించాడు. తెలుగులో వర్మ ఆఖరి (వర్మ అలా అన్నాడు మరి) సినిమా ఇది. దానికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఫేర్వెల్ ఇచ్చారు. వర్మ కూడా తెలుగులో తన సినీ ప్రయాణానికి గ్రాండ్ గా ‘శుభం’ కార్డు వేస్తాడనుకొన్నారంతా. వంగవీటితో ఏవో కొన్ని అద్భుతాలు చూపిస్తాడేమో.. ఆఖర్లో అయినా.. పాత వర్మ నిద్ర మేల్కొని గొప్ప సినిమా తీస్తాడేమో.. శివ తో ప్రారంభమైన అద్భుతమైన ప్రయాణానికి ‘వంగవీటి’తో ఎవ్వరూ ఊహించని ముగింపు ఇస్తాడేమో అని రకరకాలుగా ఆశపడి.. చివరికి భంగపడ్డారు. ‘వంగవీటి’లో అద్భుతాలేం లేవు. వర్మలో మెరుపులు ఏమాత్రం కనిపించలేదు. సరి కదా.. ‘వర్మ మారడు బ్రదర్.. అలా చెబుతాడంతే’ అని మరోసారి స్ట్రాంగ్‌గా ఫిక్సయిపోవడానికి మరింత ఛాన్స్ ఇచ్చాడు.
వర్మ టేకింగు, రైటింగు ఇవేం వంగవీటిలో కనీస స్థాయిలో లేవంటే వర్మ ఈ సినిమాని ఎలా తీశాడో అర్థమవుతుంది. మూడు హత్యలు ఓ ఇంట్రవెల్.. మరో మూడు హత్యలు ఓ శుభం కార్డు.. వర్మ ‘తీత’ ఇంత గొప్పగా ఉంది. ఇదేదో క్రైమ్ వాచ్ పోగ్రాం చూస్తున్నట్టే ఉంది తప్ప… ఈ సినిమాలో వర్మ కొత్తగా చూపించిందేం లేదని వర్మ అభిమానులు కూడా తెగ ఫీలైపోతున్నారు. సాహసాలకు పెట్టింది పేరైన వర్మ ఒక వర్గాన్నికొమ్ముకాయడానికి ఈ సినిమా తీశాడేమో అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తే… ఎక్కడి నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో అని భయపడిన వర్మ..అలాంటి సాహసాలేం చేయకుండా.. ‘మ..మ..’ అనిపించేశాడు. వర్మలోని క్రియేటివిటీనే కాదు, క్లారిటీ కూడా ఈ సినిమాతో మరుగున పడిపోయాయి. బహుశా ‘వంగవీటి’ తరవాత తనకు తెలుగులో మరో సినిమా తీసే ఛాన్సు ఉండదని ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించేసుంటాడు వర్మ. మొన్నటి ఫంక్షన్లో ‘వర్మ మరో సినిమా చేయాలి.. ఇలా చేస్తూనే ఉండాలి. లేదంటే మేం ఊరుకోం.. ‘ అని వీరావేశం కురిపించిన దర్శకులందరికీ ఈ వంగవీటి చూపించాలి. అప్పుడు కూడా ఇదే మాట చెబుతారేమో చూడాలి. మొత్తానికి వర్మ ఆఖరి చిత్రం ఇలా విషాదాంతమవుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఖరికి వర్మతో సహా!