హిందీ, కన్న చిత్ర సీమల్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ముంబైలో రియా చక్రవర్తిని నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో పోలీసులు సంజన గల్రానీని అరెస్ట్ చేశారు. వీరిద్దర్నీ అరెస్ట్ చేయడానికి బలమైన ఆధారాలున్నాయని చెబుతున్నారు. వీరు డ్రగ్స్ సేవించడం కాదు.. నేరుగా అమ్మకాలు సాగించారని డ్రగ్ పెడ్లర్లతో కలిసి బిజినెస్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పూర్తిగా డ్రగ్స్ కోణంలోనే సాగుతోంది. మూడు రోజుల పాటు రియా చక్రవర్తినిపిలిపించి విచారించిన పోలీసులు మూడో రోజు అరెస్ట్ చూపించారు. ఇప్పటికే రియా సోదరుడ్ని… సుశాంత్ మాజీ మేనేజర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రియా చాలా మంది పేర్లు చెప్పిందని ఇంగ్లిష్ మీడియా ప్రచారం ప్రారంభించారు. రియా ఇంట్లో జరిపినసోదాల్లో.. ఫోన్ చాటింగుల్లో..ల్యాప్ ట్యాప్‌లో దొరికిన సమాచారంతో.. బాలీవుడ్ ప్రముఖుల గుట్టు రట్టయిందని చెబుతోంది. త్వరలోనే బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపుతారని కూడా చెప్పడం ప్రారంభించింది. అదే సమయంలో.. కర్ణాటకలోనూ ఇదే తరహాలో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ సంజనా గల్రానీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు నేరుగా డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అంతకు ముందు మరో హీరోయిన్ రాగిణి ద్వివేదీని అరెస్ట్ చేశారు.
సంజన కేసులోనూ.. పెద్ద ఎత్తున కన్నడ సినీ ప్రముఖుల పేర్లు ఉన్నాయని… ప్రచారం జరుగుతోంది. అనిఖా అనే డ్రగ్ పెడ్లర్ అయిన యువతి డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని…అందులో అనిఖా డ్రగ్స్ సప్లయ్ చేసిన హీరో, హీరోయిన్లు, సింగర్ల పేర్లు ఉన్నాయనిచెబుతున్నారు. పలువురు సెలబ్రిటీల ఇళ్లలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆరుగురుని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులో ఒకరు పట్టుబడటం.. వారికి పెద్ద ఎత్తున ఇతరులతో సంబంధాలున్నాయని ప్రచారం జరగడం… సినీ ప్రముఖుల్ని ప్రశ్నించి..ఆనక సైలెంటయిపోవడం… డ్రగ్స్ కేసుల్లో రొటీన్ స్క్రిన్ ప్లేలా మారింది. ఇప్పుడు.. ఇది బాలీవుడ్ ,శాండల్ వుడ్లో జరుగుతోంది. రొటీన్ క్లైమాక్స్ ఉంటుందో… సంచలనాలు ఉంటాయో చూడాలి..!