ఆంధ్రప్రదేశ్లో పలు రకాల నగదు బదిలీ పథకాలు అమలు అవుతున్నాయి. కానీ లబ్దిదారులు మాత్రం.. చాలా అంటే.. చాలా పరిమితంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం… పల్లెల్లో రూ. పది వేలు.. పట్టణాల్లో రూ. పన్నెండు వేల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారిని అన్ని పథకాల్లోనూ అనర్హులను చేయడమే. తమకు అంత ఆదాయం లేదని.. ప్రత్యేకంగా ధృవీకరణ పత్రాన్ని తెచ్చుకోవాలి. ఆ ధృవీకరణ పత్రాలు.. అధికారులు ఇవ్వడం లేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీన్ని గమనించిన ప్రభుత్వం.. గొప్ప సంస్కరణ చేపట్టింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం లేదని ప్రకటించింది.
ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కార్డే ఆదాయ ధృవీకరణ పత్రంగా తేల్చింది. ఈ మేరకు.. కొత్తగా రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైట్ రేషన్ కార్డులను రద్దు చేశారు. అంతకు ముందు వైట్ రేషన్ కార్డు ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులే. అదొక్కటే అర్హతా పత్రంగా ఉండేది. అయితే.. జగన్ మాత్రం… సీఎం అయిన తర్వాత వివిధ పథకాలకు విడివిడిగా కార్డులు మంజూరు చేయడం ప్రారంభించారు. బియ్యంకార్డులను విడిగా మంజూరు చేశారు. రేషన్ తప్ప.. ఇతర పథకాలకు అది ఉపయోగపడదు.
ఆరోగ్యశ్రీ కార్డులు.. ఇతర పథకాల కార్డులు అలాగే మంజూరు చేశారు. దీంతో.. ఆదాయ ధృవీకరణ పెద్ద సమస్యగా మారింది. ప్రజల నుంచి అసంతృప్తి … నిరసనలు వ్యక్తం కావడంతో.. ప్రభుత్వం… బియ్యం కార్డునే.. ఆదాయ ధృవీకరణ పత్రంగా గుర్తించడానికి అంగీకరించింది. ఒక వేళ పేదల వద్ద బియ్యం కార్డులు లేకపోతే మరో ఆప్షన్ కూడా ప్రభుత్వం కల్పించింది. సెల్ఫ్ డిక్లరేషన్ను తీసుకుని దాని ఆధారంగా నాలుగేళ్ల కాలపరిమితితో ప్రత్యేకంగా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. దీంతో పేదలకు భారీగా మేలు జరగనుంది.