బిచ్చగాడు సినిమా గుర్తుందా?. ఒక కోటోశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం. విజయ్ ఆంటోనీ హీరో గా వచ్చిన ఈ సినిమా తెలుగునాట సంచలన విజయం సాధించింది. అయితే అచ్చు ఈ సినిమా కథలో లాగే నిజ జీవితం లోనూ జరిగింది. ఒకటి రెండు కాదు, పలువురు ఇలా చేస్తూ దొరికారు హైదరాబాద్ పోలీసులకి. ఇవాంకా సందర్శన సందర్భంగా హైదరాబాద్ లోని బిచ్చగాళ్ళందరినీ జైళ్ళ శాఖ అధికారులు తరలిస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఫర్జానా అనే ఒకావిడకి అమెరికా లో గ్రీన్ కార్డ్ ఉంది. కానీ ఒక బాబా చెప్పాడని ఇలా బిచ్చగత్తె గా మారింది. రబియా అనే మరొకావిడ కి చాలా ఆస్తులున్నాయి. వాటిని కొంతకాలం చూసుకోవాల్సిందిగా బంధువులకి అప్పగించి వచ్చి మరీ యాచన చేస్తోంది. కారణమడిగితే, మళ్ళీ సేం టు సేం. ఈమెకి కూడా ఎవరో బాబా ఇలా చెపాట్ట. వీళ్ళిద్దరే కాక మరికొంత మంది కూడా ఇలాంటి బాపతు ఉన్నట్టు పోలీసులంటున్నారు.
ఎవరికి ఏ వ్యక్తిగత సమస్యలున్నాయో, ఎందుకిలా చేస్తున్నారో తెలీదు కానీ బాబాలు ఇలాంటి సూచనలివ్వడం ఆశ్చర్యం. కాబట్టి హైదరబాదీలూ, ఈ సారి మీరు దానం చేస్తున్నపుడు గుర్తుంచుకోండి అవతలి వ్యక్తి ఏ కోటీశ్వరుడో కూడా అయి ఉండొచ్చు…