ఓ వైపు ఒలింపిక్స్ లో పతకాలు రావడం లేదని భారతీయులు బాధపడుతున్నారు. క్రీడాకారులు పతకాల సాధనకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రియో ఒలింపిక్ గ్రామంలో క్రీడా మంత్రి విజయ్ గోయెల్ తన సెల్ఫీ పిచ్చితోభారత్ పరువు తీస్తున్నాడు.
ఈమధ్యే మోడీ ప్రభుత్వంలో క్రీడాశాఖ సహాయ మంత్రిగా చేరిన గోయల్, ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు రియో వెళ్లారు. అక్కడ బుద్ధిగా ఉంటే పరవాలేదు. కానీ క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. రూల్స్ ఉల్లంఘించి చీవాట్లు తింటున్నారు. చివరకు ఆయన్ని మెడబట్టి గెంటెయ్యాలా అనే స్థాయిలోఒలింపిక్ నిర్వహణ కమిటీ వారు ఆగ్రహించే స్థాయికి వెళ్లింది.
భారతీయ క్రీడాకారులు ఉన్న చోటుకు వెళ్లి సెల్ఫీలు దిగటమే గోయెల్ పని. బాక్సర్ వివేక్ కృష్ణ అప్పుడే మ్యాచ్ పూర్తిచేసి అలసి సొలసి రింగ్ దిగాడు. అంతే క్రీడా మంత్రి అక్కడ వాలిపోయాడు. అతడితో సెల్ఫీ దిగాడు. మన బాక్సర్ ఎంత అలసి పోయి ఉన్నాడో ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దీపా కర్మాకర్ తదితర క్రీడాకారులు అటు పోటీ పూర్తి చేశారో లేదో, అలసి పోయి ఉంటారనే స్పృహ కూడా లేకుండా సెల్ఫీకి పోజిమ్మని మంత్రి బలవంతపెడుతున్నాడు.
క్రీడాకారులు, అంపైర్లు, నిర్వాహక సిబ్బంది మాత్రమే వెళ్లాల్సిన చోటికి కూడా గోయెల్ వెళ్తున్నారట. పైగా అతడి వెంట ఉన్న వందిమాగధులు సిబ్బంది పట్ల రఫ్ గా ప్రవర్తిస్తున్నారట. ఇప్పటికే నిర్వాహకులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అయినా పద్ధతి మారలేదు. ఇదంతా చూసిన ఒలింపిక్స్ కాంటినెంటల్ మేనేజర్ కు చిర్రెత్తుకొచ్చింది. మీ మంత్రిని పద్ధతిగా ఉండమని చెప్పండి. లేకపోతే ఆయన అక్రిడేషన్ రద్దు చేసి బయటకు పంపాల్సి ఉంటుందని భారత్ చెఫ్ డి మిషన్ రాకేష్ గుప్తాకు ఘాటు వార్నింగ్ ఇచ్చాడు.
ఇంత పెద్ద దేశానికి పతకాలు ఎప్పుడు వస్తాయా అని అంతా ఎదురు చూస్తుంటే మంత్రి మాత్రం ఓవర్ యాక్షన్ తో దేశ పరువు తీస్తున్నాడు. అలాంటి వాడిని వెంటనే వెనక్కి రమ్మని ప్రధాని మోడీ ఆదేశిస్తే బాగుటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.