ఇక ఎన్నికలు ఎందుకు నేను గెలిచినట్లే అధ్యక్షుడిగా ప్రకటించేయండి అని గతంలో నేరుగా ప్రకటించేసిన విపరీత మనస్థత్వం ఉన్న అమెరికా ప్రెసిడెన్షియల్ అభ్యర్థి డొనాల్డ్స్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారం బదిలీ చేయకుండా ఆయన చేసిన విన్యాసాల గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు అధ్యక్షుడిగా లేరు. అయినా సరే ఆయన ఓటమిని అంగీకిరంచే ప్రశ్నే లేదంటున్నారు. తాను ఓడితే అది మోసమేనని అంటున్నారు.
రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డెమొక్రాట్ కమలా హారిస్‌పై గెలవకపోతే ఫలితాలను అంగీకరించబోమని ఇప్పటికే ప్రకటించారు. మనం ఓడిపోతే వాళ్లు మోసం చేసినట్లేనని ట్రంప్ తన మద్దతుదార్లకు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలను వివాదాస్పదం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలను ముందస్తుగా దాఖలు చేస్తున్నారు. ఓటర్లు కాని వారు ఓట్లేస్తున్నారని అంటున్నారు.
ఎలాన్ మస్క్ ఇలాంటి ప్రచారంలో చాలా ముందు ఉన్నారు. ట్రంప్ కోసం ఆయన ట్విట్టర్ ను పూర్తి స్థాయి లో ఉపయోగిస్తున్నారు. ఓటర్లు కాని వారు ఎలా ఓట్లేస్తారన్న విషయాన్ని పక్కన పెట్టి ఆయన చేస్తున్న ప్రచారాన్ని అమెరికన్లు నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ట్రంప్ కొన్ని వేల మందిని ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి రెడీగా ఉంచారు. ఫలితాలు తేడాగా వస్తూంటే వీరు ఏం చేయాలో శిక్షణ ఇస్తున్నారు.
ఇప్పటికే బ్యాలెట్ బాక్సులకు నిప్పు లాంటి పనులు కూడా జరిగాయి. అందుకే ఎన్నికలకు రక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే అక్రమాలని వాదించే భారత రాజకీయ నేతల కన్నా ఘోరంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. ఆయన తీరుతో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.