2022లో దక్షిణాది చూసిన అతి పెద్ద విజయాల్లో `కాంతార` ఒకటి. కన్నడ సినిమా వైభవానికి `కాంతార` ప్రతీకగా నిలిచింది. నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. అప్పటి నుంచి `కాంతార 2` కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. కాంతారా 2కి ఇంకా టైమ్ ఉందంటూ రిషబ్ శెట్టి చెబుతూనే వచ్చాడు. 2023లో కాంతార 2 రాదని చాలామంది ఫిక్సయిపోయారు. అయితే రిషబ్ ఇప్పుడు అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నాడు. తన సినిమాలన్నీ పక్కన పెట్టి `కాంతార 2`ని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడని టాక్. అయితే ఇది `కాంతార`కి సీక్వెల కాదు.. ప్రీక్వెల్. ఇప్పటికే కథ సిద్ధమైందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని కన్నడ సినీ వర్గాల టాక్. కాంతారలో కనిపించిన నటీనటులే.. ఈ ప్రీక్వెల్లోనూ కనిపించనున్నారు. ఇంకొన్ని కొత్త పాత్రలు భాగం పంచుకోనున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా కాంతార 300 కోట్లు వసూలు చేసింది. అయితే దాని బడ్జెట్ రూ.20 కోట్ల లోపే. పార్ట్ 2కి కావల్సినంత బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. కాకపోతే.. మరీ ఎక్కువ హంగులు, ఆడంబరాలకు పోకుండా `కాంతార`ని పరిమిత బడ్జెట్ లో ఎలా తెరకెక్కించారో.. పార్ట్ 2కి కూడా అలానే తీయాలని నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ యేడాది జూన్ – జులైలలో ఈ ప్రీక్వెల్ పట్టాలెక్కుతుంది.