బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ పేల్చిన బాంబు, ప్రపంకపనలు సృష్టిస్తోంది. దేశంలోని అనేక రోడ్లకు, భవనాలకు, విమానాశ్రయాలకు, విద్యా సంస్థలకు నెహ్రూ గాంధీ కుటుంబీకుల పేర్లే ఎందుకు పెట్టారని ఆయన ట్విటర్ లో ప్రశ్నించారు. బాప్ కా మాల్ అనుకున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ అని ఎందుకు అనాలి? మహాత్మాగాంధీ లేదా భగత్ సింగ్ ఎయిర్ పోర్ట్ అని పేరు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎంతో మంది మహనీయులున్నారు. వాళ్ల పేరు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఈ దేశం గాంధీలా జాగీరా అనే తరహాలో వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు.
సహజంగానే ఇది కాంగ్రెస్ వారికి నచ్చలేదు. దీంతో ఆ పార్టీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రిషీ కపూర్ చరిత్ర తెలుసుకోవాలని సూచిస్తున్నారు. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకూ ఆ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందంటున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఆ కుటుంబం ఎంతో శ్రమించిందని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. అందుకే చాలా వాటికి వాళ్ల పేర్లు పెట్టాం తప్పేంటని దబాయిస్తున్నారు.
బాలీవుడ్ లోని కొందరు నటులు మాత్రం రిషీ కపూర్ ను సమర్థిస్తున్నారు. ఆయన చెప్పింది నిజమేనంటున్నారు. ప్రతిదానికీ రాజకీయ నాయకుల పేర్లు, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లు పెట్టడం మంచిది కాదంటున్నారు. కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో ఎంతో మంది మహనీయులు ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. వాళ్ల పేర్లు పెట్టవచ్చని సూచిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పథకాలకు, భవనాలకు, విద్యాసంస్థలకు, రోడ్లకు ఆ కుటుంబీకుల పేర్లే పెట్టడం ఆనవాయితీ అయింది. ఆ పార్టీ ముఖ్యమంత్రులు కూడా అధినేతల ప్రాపకం కోసం ఎక్కువగా రాజీవ్, ఇందిర పేర్లు పెట్టడం రివాజుగా మారింది.
మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్ వంటి వారు కూడా కాంగ్రెస్ వారే అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంత సేపూ ఇందిర, రాజీవ్ భజన చేస్తూ వాళ్ల పేర్లన జపించారు. ఇప్పుడు ఢిల్లీలో రెండు రోడ్లకు పేరు మార్చాలనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే రిషీ కపూర్ బాంబు పేల్చారు. ఈ దేశం అబ్బ సొత్తు అనుకున్నారా అంటూ చాలా ఘాటుగానే ప్రశ్నాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ ఇప్పటికైనా వాస్తవాలను గుర్తిస్తారేమో అని కొందరు భావిస్తున్నారు. కానీ ఆ కుటుంబం చేసిన త్యాగాల గురించి అనర్గలంగా ప్రసంగాలు చేయడంలో నిమగ్నమైన నేతలు, వాస్తవాలను గుర్తిస్తున్న సూచనలు అణుమాత్రం కూడా కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ వారికి ఇప్పుడు మెల్లమెల్లగా వాస్తవాలు బోధపడుతున్నాయి. అయినా ఆ కుటుంబ వీర విధేయులైన పలువురు నేతలు మాత్రం వైఖరిని మార్చుకోవడం లేదు.