హైదరాబాద్: రణబీర్ కపూర్ తండ్రి, అలనాటి కథానాయకుడు రిషికపూర్ ప్రస్తుతం తండ్రి పాత్రలు, తాత పాత్రలు వేస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ షకున్ బాత్రా దర్శకత్వంలో నిర్మిస్తున్న కపూర్ అండ్ సన్స్ అనే చిత్రంలో రిషికపూర్ 90 ఏళ్ళ ఒక వృద్ధుడి పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రకు మేకప్‌ను హాలీవుడ్‌కు చెందిన నిపుణుడు గ్రెగ్ క్యానమ్ చేశారు. గ్రెగ్ ‘టైటానిక్’ చిత్రానికి బ్రాడ్ పిట్ నటించిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బటన్’ చిత్రానికి పనిచేశారు.
90 ఏళ్ళ వృద్ధుడిగా కనిపించేందుకు ఆ ప్రత్యేక మేకోవర్ కోసం మొత్తం రు.2 కోట్ల ఖర్చయినట్లు రిషికపూర్ వెల్లడించారు. ఈ చిత్రంలో సిద్దార్థ మల్హోత్రా, అలియా భట్, ఫవాద్ ఖాన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చిత్రంలో రిషికపూర్ పోషించే పాత్ర చాలా ముఖ్యమైనదని, అందుకే ఎంత ఖర్చుకయినా వెనకాడలేదని దర్శకుడు షకున్ బాత్రా చెప్పారు. ఈ చిత్రం గురించి చర్చించటానికి రిషికపూర్ వద్దకు వెళ్ళినపుడు ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బటన్ చిత్రంలోని బ్రాడ్ పిట్ ఫోటోను చూడటం జరిగిందని, దానికి తోడు గ్రెగ్ ఆ సమయంలో ముంబాయిలోనే ఉండటంతో అతనిని సంప్రదించామని బాత్రా చెప్పారు.