రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాన మంత్రికాబోతున్నారు. ఒకప్పుడు ఇండియాను పరిపాలించిన తెల్లదొరలను ఇప్పుడు ఇండియన్ పరిపాలించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెలన్నరకే లిజ్ ట్రస్.. హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారు. ఆమె తీసుకున్న నిర్ణయాలకు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఎంపీల మద్దతు కోల్పోవడంతో ఆమె రాజీనామా చేయక తప్పలేదు.
నాలుగు నెలల కిందట… టోరీల మద్దతు కోసం రిషి సునాక్ .. తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎక్కువ మంది ట్రస్‌కే మద్దతుగా నిలువడంతో పరాజయం పాలయ్యారు. అయితే ట్రస్ రాజీనామాతో రిషి సునాక్‌కు మద్దతు పెరిగింది. మాజీ ప్రధాని బోరిన్ జాన్సన్ తాను మళ్లీ రేసులో నిలబడతానని ప్రకటించారు. కానీ మద్దతు లేదని తెలియడంతో వెనుకడుగు వేశారు. నామినేషన్ వేసిన పెన్ని మోర్డంట్ అనే ఎంపీ కూడా ఉపసంహరించుకున్నారు. దీంతో సునాక్ ఒక్కరే పోటీలో ఉన్నట్లయింది. దీంతో ఆయన తదుపరి బ్రిటన్ ప్రధాని కావడం ఖాయమయింది.
బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పుడు రిషి సునాక్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రధాని కాబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ బాధ్యతలు ఏమంత తేలికైనవి కావు. చాలా సవాళ్లతో కూడుకున్నవి. అయితే ఆర్థిక నిపుణుడిగా పేరు పొందిన సునాక్.. ఇంగ్లాండ్‌ను గట్టెక్కిస్తారని ఆ దేశ ప్రజలు నమ్మకంతో ఉన్నారు. రిషి సునాక్… ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు.