మోహన్ బాబు వయసు… 65 ఏళ్లు. ఈ వయసులో ఆయన ఒళ్లు హూనమయ్యేలా ఫైటింగులు చేయనవసరం లేదు. డూపులు లేకుండా బరిలో దిగాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ.. ‘గాయత్రి’ కోసం ఇవి రెండూ చేశారు. చాలా కాలం తరవాత.. మోహన్ బాబు సినిమాపై ఓరకమైన పాజిటీవ్ బజ్ ఏర్పరచిన సినిమా ఇది. ప్రోమోలతో, పబ్లిసిటీతో అదరగొట్టేస్తున్నారు. సెట్లో కూడా అంతే కష్టపడ్డారు మోహన్ బాబు. ఈ సినిమా లో మూడు ఫైట్లున్నాయి. వాటిలో మోహన్ బాబు డూప్‌ని ఏమాత్రం వాడలేదు. క్లైమాక్స్ ఫైట్‌లోనూ అంతే. ఇందులో కొన్ని వైర్ సెట్టింగులు ఉన్నాయి. గాల్లో ఫీట్లు చేయాల్సివచ్చిందట. అందుకోసం డూప్‌ని సెట్ చేద్దామని అన్నా మోహన్ బాబు ఒప్పుకోలేదు. కమల్ కన్నన్ నేతృత్వంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫైట్‌ని తీర్చిదిద్దారు. ఈ ఒక్క ఫైట్ కోసమే కోటి రూపాయలు ఖర్చయ్యిందని సమాచారం. ఈ వారంలో మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇంటిలిజెంట్, తొలి ప్రేమతో పాటు గాయత్రి పోటీ పడుతోంది. మూడు సినిమాలతో పోలిస్తే… గాయత్రి ప్రమోషన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి తగిన ఫలితం వస్తుందో, రాదో చూడాలి.