ఇటీవల ‘మట్కా’ సినిమాతో మన ముందకు వచ్చాడు వరుణ్ తేజ్. అంతకు ముందు వచ్చిన ‘గని’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాలు బెడసి కొట్టాయి. ‘మట్కా’ కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఈదశలో వరుణ్ ఓ హిట్టు కొట్టడం చాలా అవసరం. ఇలాంటి క్లిష్టమైన తరుణంలో మేర్లపాక గాంధీ కథకు ఓకే చెప్పేశాడు వరుణ్. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ఈసినిమా కోసం ఫిక్స్ చేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే హారర్ సినిమా ఇది. కొరియన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా రితికా నాయక్ ని ఎంచుకొన్నట్టు సమాచారం అందుతోంది. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమాలో నటించింది రితిక. ‘హాయ్ నాన్న’లోనూ కనిపించింది. ప్రస్తుతం `మిరాయ్`లో నటిస్తోంది. ఇప్పుడు వరుణ్ సినిమాలో ఒకే అయినట్టు తెలుస్తోంది. ఇటీవల రితికపై ఓ లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. హారర్ జోనర్ అయినా.. ఇప్పటి వరకూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. కొరియన్ సినిమాల ప్రభావం మన దర్శకులపై ఉంది. ఓటీటీల పుణ్యమా అని కొరియన్ సిరీస్‌లూ మన వాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా కొంతమంది కొరియన్ నటీనటులు కనిపించే అవకాశం ఉంది. వాళ్ల కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.